తెలంగాణ

telangana

By

Published : Dec 14, 2020, 7:14 AM IST

ETV Bharat / city

యాజమాన్య హక్కుల కోసం ఎదురుచూపులు..

భూములున్నాయి... కానీ వాటికి యాజమాన్య హక్కు ఉన్నట్లు నిర్ధరించే అవకాశం లేదు. పాసుపుస్తకాలిస్తే రైతుబంధు, బీమా వస్తాయి. కానీ సాంకేతిక సమస్యలతో అవి జారీ కావడంలేదు. తమ గోడు విని పరిష్కరించాలంటూ రైతులు, భూ యజమానులు తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

people are waiting for ownership rights for their land in telangana
యాజమాన్య హక్కుల కోసం ఎదురుచూపులు

భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం (ఎల్‌ఆర్‌యూపీ) అనంతరం ఆ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. సమాచారం స్పష్టంగా ఉన్న రైతులకు పాసుపుస్తకాలు జారీ చేయగా.. మరికొందరికి రకరకాల సమస్యలతో నిలిచిపోయాయి. వీటిలో కొన్ని సిబ్బంది తప్పిదాలతోనూ ఆగిపోయాయి. ఇలాంటి సమస్యలను తరువాత పరిష్కరించవచ్చనే ఉద్దేశంతో వివాదాలతో కూడిన భూముల జాబితాలో (పార్ట్‌-బి) చేర్చారు. ఇలా పార్ట్‌-బిలో 10 లక్షల ఎకరాలు ఉన్నాయి. తీరా ధరణి పోర్టల్లో వీటికి ఐచ్ఛికాలు ఇవ్వకపోవడంతో ఆ సమస్యలన్నీ అపరిష్కృతంగా ఉండిపోయాయి.

గత అక్టోబరులో ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం ఆర్‌వోఆర్‌-2020తో తహసీల్దార్ల అధికారాల్లో మార్పులు తెచ్చింది. వారికి పాసుపుస్తకాలను జారీ చేసే అధికారం కూడా పోయింది. వారు రిజిస్ట్రేషన్ల సేవలకే పరిమితమయ్యారు. రెవెన్యూ కోర్టుల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కానీ, అధికారుల సేవలతో ముడిపడి ఉన్న సమస్యలను పరిష్కరించే బాధ్యత ఎవరికిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

కొన్ని ఉదాహరణలు..

* ఎల్‌ఆర్‌యూపీ అనంతరం తాతల నుంచి వస్తున్న హక్కులు ఆన్‌లైన్‌లో లేకుండా పోయాయంటున్నారు భద్రాద్రి, ములుగు జిల్లాలకు చెందిన పలువురు రైతులు. ఓఆర్‌సీ, ఆర్‌ఎస్‌ఆర్‌ సమస్యలతో అక్టోబరు ముందు వరకు తిప్పించుకున్న రెవెన్యూ సిబ్బంది ఇప్పుడు తమకు సంబంధం లేదంటున్నారని వారు వాపోతున్నారు.

* రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం పెద్ద అంబర్‌పేటలో 0.33 ఎకరాల భూమి ఉన్న ఎన్‌.హనుమంతరావు తన భూమికి పట్టా పాసుపుస్తకం కోసం పది నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. డిజిటల్‌ సంతకం పెండింగ్‌లో ఉందంటూ మొన్నటివరకు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో వివరాలు కనిపించాయి. ఇప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాలేదు.

* ఆదిలాబాద్‌ గ్రామీణ మండలానికి చెందిన అంబటి భూమన్న తన భూమికి యాజమాన్య హక్కులు కల్పించాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 9న మీ సేవ ద్వారా (నెం.022001863072) రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేశారు. పది నెలలైనా సమస్య పరిష్కారం కాలేదు. మరోవైపు ధరణి పోర్టల్‌ అమల్లోకి రావడంతో గత నెల 13న చలానా (నెం.9813933767816) కింద రూ.1550 చెల్లించి మరోసారి మ్యుటేషన్‌కు దరఖాస్తు చేశారు. ఆ సమాచారం ధరణిలో కనిపించడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు.

అపరిష్కృతంగా ఉన్న సమస్యల్లో కొన్ని..

* ఎల్‌ఆర్‌యూపీ సందర్భంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసే క్రమంలో కొన్ని సర్వే నంబర్లలో విస్తీర్ణాలు తగ్గిపోయాయి. కొన్ని సర్వే నంబర్లు నమోదు చేయలేదు. ఆన్‌లైన్‌లో సర్వే నంబర్లు కనిపించని భూములకు పాసుపుస్తకాల జారీ నిలిచిపోయింది. ఇలా సర్వే నంబర్లు తప్పినవి, విస్తీర్ణాల్లో లోపాలున్నవి 2.15 లక్షల ఎకరాలున్నాయి.

* ఈ ఏడాది అక్టోబరు ముందు వరకు రిజిస్ట్రేషన్‌ పూర్తయిన భూములకు మ్యుటేషన్లు పూర్తి చేయాల్సి ఉంది. ఇలాంటివి 3.50 లక్షల ఖాతాలున్నాయి.

* కొందరు రైతుల భూదస్త్రాలపై తహసీల్దార్లు డిజిటల్‌ సంతకం (డీఎస్‌) చేయాల్సి ఉంది.

* ఆర్‌ఎస్‌ఆర్‌ (రెవెన్యూ సెటిల్‌మెంట్‌ రికార్డు) సమస్యతో కొందరు రైతులకు చెందిన భూముల విస్తీర్ణాలను తగ్గించారు.

* ఓఆర్‌సీ (భూమి అధీనంలో ఉన్నట్లు చూపే ధ్రువీకరణ పత్రం) ఉన్న రైతులకు యాజమాన్య హక్కులు కల్పించాల్సి ఉంది.

* ఏజెన్సీ ప్రాంతంలో భూ బదిలీ నిషేధిత చట్టం (ఎల్‌టీఆర్‌) సమస్యలు పరిష్కరించాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details