తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆయన తోటలో... ఎన్ని రకాల అరటిపండ్లో..! - చక్కెరకేళి అరటిపండు

అరటిపండు... పసిపిల్లల నుంచి వృద్ధుల వరకూ సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ అందరూ ఇష్టంగా తినే పోషకాల పండుగా సుపరిచితమే. ఎన్ని రకాల అరటిపండ్లను తిన్నారూ అంటే మాత్రం ఎవరైనా సరే కర్పూరకేళి, అమృతపాణి, చక్కెరకేళి... ఇలా వేళ్లమీద లెక్కేచెబుతారు. కానీ కేరళలోని పారసాల గ్రామానికి చెందిన వినోద్‌ సహదేవన్‌ నాయర్‌ మాత్రం 430 రకాల్ని రుచి చూశానంటాడు. అదెలానో చూద్దామా..!

four hundred types of bananas at kerala banana garden
కేరళ అరటి తోటలో 430 రకాల అరటిపండ్లు

By

Published : Nov 1, 2020, 10:07 AM IST

అరటితోటలు చాలామందే పెంచుతారు కానీ ఆ తోట భిన్నంగా ఉండాలనీ, చుట్టుపక్కల ఎక్కడా కనిపించని వాటిని పండించాలనీ కొందరే అనుకుంటారు. ఆ కోవకు చెందిన వ్యక్తే వినోద్‌. అందుకే ఆయన తోటలో పొడవాటి అసోం అరటి నుంచి పొట్టి జహాంజీ; ఎరుపు రంగు అరటితోపాటు ప్రపంచంలోనే అరుదుగా పండించే బ్లూ జావా; వాసనతో మైమరపించే మనోరంజితం, గెలకి వెయ్యికి పైగా ఉండే ఫింగర్‌ బనానా వరకూ ఎన్నో రకాలు పండిస్తున్నాడు. చేతులు ముకుళించినట్లుగా ఉండే ప్రేయింగ్‌ హ్యాండ్స్‌, ఉప్పగా ఉండే ‘మట్టి’, ఒట్ట ముంగ్లి, కరింగడలి, సూర్యకడలి, లేడీస్‌ఫింగర్‌... ఇలా చాలానే ఆయనతోటలో కనిపిస్తాయి.

అందుకే ‘ఐసీఎఆర్‌- నేషనల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ బనానా’ సంస్థ ఆయనకు ఉత్తమ రైతు అవార్డును అందించింది. ఎక్కువ రకాల అరటి పండ్లను పండించిన వ్యక్తిగా లిమ్కా రికార్డూ వినోద్‌ని వరించింది. అలాగని ఇదంతా ఒకటి రెండేళ్లలో వచ్చినది కాదు. దాని వెనక 30 ఏళ్ల కృషి ఉంది.

దేశవిదేశాలన్నీ తిరిగి..

తిరువనంతపురం సమీపంలోని చిన్న గ్రామం... పారసాల. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వినోద్‌, బీఎస్సీ తరవాత వెబ్‌ డిజైనింగ్‌ చేసి కొచ్చిలో ఉద్యోగం చేసుకునేవాడు. తల్లి హఠాన్మరణంతో తండ్రి కోసమని సొంతూరికి చేరుకున్నాడు. తండ్రితోపాటు తమకున్న మూడెకరాల్లోనే వ్యవసాయం చేయాలనుకున్నాడు. చిన్నప్పటి నుంచి తోటపని అంటే సహజంగానే ఇష్టమున్న వినోద్‌కి అదేం కష్టంగా అనిపించలేదు. అందుకే ఉద్యోగం మానేసి ఇష్టంగా అరటి మొక్కల పెంపకాన్నే వృత్తిగా మలుచుకున్నాడు.

అందరిలా ఒకే రకం కాకుండా రాష్ట్రంలో ఎక్కడా కనిపించని రకాలన్నింటినీ పండించాలని అనుకున్నాడు. అందుకోసం గుజరాత్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, బెంగాల్‌, ఒడిశా, అసోం, మణిపూర్‌... ఇలా ఎక్కడ వెరైటీ ఉందంటే అక్కడికి వెళ్లాడు. ఆయా ప్రాంతాల్లోని హార్టీకల్చర్‌ విభాగాల్నీ, యూనివర్సిటీల్నీ పలకరించాడు. వెరైటీల గురించి సమాచారం ఇవ్వడానికి చాలామంది సహకరించలేదు. అయినా నిరాశపడలేదు. అరటి రకాల్ని ఎక్కువగా పండించే మలేషియా, ఫిలిప్పీన్స్‌, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, హవాయ్‌, హోండూరస్‌... వంటి దేశాల్ని సందర్శించాడు. వాటి గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ఆ పిలకల్ని తెచ్చి తన తోటలో నాటాడు.

‘మా దగ్గర పెంచే వాటిల్లో కూరగాయలుగా వాడేవీ ఉన్నాయి. కన్యాకుమారికి చెందిన ‘మనోరంజితం’ రకం పరిమళం అద్భుతం. ఆ వాసన కోసమే ఒకప్పుడు వేడుకల సమయాల్లో ఈ గెలను గుమ్మానికి వేలాడదీసేవారట. ‘బ్లూ జావా’ ఐస్‌క్రీమ్‌ రుచిని మరిపిస్తుంది. ‘అనమోందన్‌’ గెల ఒక్కటీ 30 కుటుంబాలకి సరి పోతుంది. ‘అసోం’ రకంలో గింజలూ ఉంటాయి. అయితే అన్నీ పోషకాలతో నిండినవే’ అంటాడు వినోద్‌. అంతేకాదు, ఆదాయం కోసం కాకుండా అరటిపండ్లమీద ఉన్న ఇష్టంతోనే తాను ఈ రకాలన్నీ సేకరించాన’ని చెప్పే వినోద్‌ను తెలిసినవాళ్లంతా వాళచేట్టన్‌ (బనానా మ్యాన్‌) అని పిలుస్తారట. అది విన్నప్పుడల్లా నాకు గర్వంగా అనిపిస్తుంది అంటాడాయన. అవునుమరి... ఒకటా రెండా... 430 రకాల అరటి రకాల్ని పెంచడం అంత ఈజీ అయితే కాదుగా మరి.

ABOUT THE AUTHOR

...view details