తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Farmers Suicide : ఏడేళ్లలో 5,591 మంది రైతుల ఆత్మహత్య - తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు 2014-2022

Telangana Farmers Suicide : తెలంగాణ ఏర్పడిన గత ఏడేళ్లలో ఐదు వేలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. గత అయిదేళ్లలో రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం 89 శాతం, ఉత్పత్తి 97 శాతం, సేకరణ 162.88 శాతం పెరిగినట్లు వెల్లడించారు.

Telangana Farmers Suicide
Telangana Farmers Suicide

By

Published : Apr 6, 2022, 8:37 AM IST

Telangana Farmers Suicide : తెలంగాణ ఏర్పడిన గత ఏడేళ్లలో ఆ రాష్ట్రంలో 5,591 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ కాంగ్రెస్‌ ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఆయన ఇచ్చి సమాచారం ప్రకారం 2015లో అత్యధికంగా 1,358 మంది బలవన్మరణానికి పాల్పడగా, 2020లో అతి తక్కువగా 466 మంది అర్ధంతరంగా తనువు చాలించారు.

అయిదేళ్లలో 89శాతం పెరిగిన సాగు :తెలంగాణలో గత అయిదేళ్లలో వరిసాగు విస్తీర్ణం 89 శాతం, ఉత్పత్తి 97 శాతం మేర, సేకరణ 162.88 శాతం మేర పెరిగినట్లు వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ లోక్‌సభలో వెల్లడించారు. 2016-17లో 16.82 లక్షల హెక్టార్ల మేర ఉన్న వరి విస్తీర్ణం 2020-21 నాటికి 31.86 లక్షల హెక్టార్లకు చేరినట్లు వివరించారు. 2016-17లో 51.73 లక్షల టన్నులుగా ఉన్న ఉత్పత్తి 2020-21నాటికి 102.17 లక్షల టన్నులకు పెరిగిందన్నారు. సేకరణ 2016-17లో 53.67 లక్షల మెట్రిక్‌ టన్నులుండగా 2020-21లో 141.09 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర చేసినట్లు చెప్పారు. 2016-17 మినహా మిగిలిన నాలుగేళ్లలో పంజాబ్‌ తర్వాత అత్యధిక సేకరణ తెలంగాణ నుంచే చేపట్టినట్లు తెలిపారు. 2018-19 నాటికి జాతీయస్థాయిలో రైతుకుటుంబ నెలవారీ ఆదాయం సగటున రూ.10,218 మేర ఉండగా, తెలంగాణలో అది రూ.9,403కి పరిమితమైనట్లు వెల్లడించారు.

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై తీర్మానం అందింది :ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానం 2015 నవంబరు 30న సామాజిక న్యాయం, సాధికార మంత్రిత్వశాఖకు అందినట్లు ఆ శాఖ సహాయమంత్రి ఎ.నారాయణస్వామి తెలిపారు. మంగళవారం లోక్‌సభలో తెరాస ఎంపీలు జి.రంజిత్‌రెడ్డి, వెంకటేష్‌నేత బొర్లకుంట, కవిత మాలోతు, పసునూరి దయాకర్‌లు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై పరిశీలన కోసం జస్టిస్‌ ఉషామెహ్రా నేతృత్వంలో ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్‌ 2008 మే 1న నివేదికపై సంప్రదింపుల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ వర్సెస్‌ దావిందర్‌ సింగ్‌ (సివిల్‌ అప్పీల్‌ నం. 2317/2011) కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నందున ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం సబ్‌జ్యుడిస్‌ కిందికి వస్తుంది’’ అని మంత్రి నారాయణస్వామి వివరించారు.

తెలంగాణలో ఎస్సీ జనాభా 15.43 శాతం :2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తర్‌ప్రదేశ్‌లో 20.70శాతం, తెలంగాణలో 15.43శాతం ఎస్సీ జనాభా ఉన్నట్లు సామాజిక న్యాయం, సాధికారశాఖ సహాయమంత్రి ఎ.నారాయణస్వామి తెలిపారు. కాంగ్రెస్‌ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీఎస్పీ సభ్యుడు కున్వర్‌ డానిష్‌అలీ మంగళవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. జనాభా ప్రాతిపదికన ఈ రిజర్వేషన్లను పెంచాలని యూపీ, తెలంగాణ ప్రభుత్వాల నుంచి కేంద్రానికి ఎలాంటి ప్రతిపాదనలూ రాలేదని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details