తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా పంజా: రాష్ట్రంలో 70 శాతం మందికి లక్షణాలు లేకుండానే వ్యాధి - తెలంగాణలో కరోనా వ్యాధి కేసులు

తెలంగాణలో చాపకింద నీరులా కొవిడ్​ వైరస్​ విస్తరిస్తోంది. ఇప్పటివరకు 1,60,571 మంది కరోనా బాధితుల్లో 1,12,400.. అంటే 70 శాతం మందికి ఎలాంటి లక్షణాల్లేకుండా ఉండటం గమనార్హం. ఇప్పటివరకూ కరోనా బారినపడి ఆరోగ్యవంతులుగా మారినవారి సంఖ్య 1,29,187కు చేరుకుంది. మొత్తంగా మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 984కు పెరిగింది.

more than 70 percent corona patients in telangana are asymptomatic
కరోనా పంజా: రాష్ట్రంలో 70 శాతం మందికి లక్షణాలు లేకుండానే వ్యాధి

By

Published : Sep 16, 2020, 6:04 AM IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ నిశ్శబ్దంగా కమ్మేస్తోంది. సోమవారం కొత్తగా 2058 కరోనా కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకూ నమోదైన మొత్తం పాజిటివ్‌(1,60,571)ల్లో ఎలాంటి లక్షణాల్లేకుండా కరోనాగా నిర్ధారణ అయినవారు 1,12,400.. అంటే 70 శాతం మంది ఉండటం గమనార్హం. దగ్గు, జ్వరం, గొంతు నొప్పి తదితర లక్షణాలతో కొవిడ్‌గా తేలినవారు 48,171(30 శాతం) మంది ఉన్నారు. ఆదివారం వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని వైద్యఆరోగ్యశాఖ మంగళవారం(15న) విడుదల చేసింది. సోమవారం 51,247 నమూనాలను పరీక్షించగా, వీటిలో ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులు 22,548(44శాతం) మంది, సెకండరీ కాంటాక్టు వ్యక్తులు 6,149(12శాతం) మంది ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం పరీక్షల సంఖ్య 22,20,586కు పెరిగింది. మరో 908 నమూనాల ఫలితాలు ఇంకా వెల్లడవ్వాల్సి ఉందని వైద్యశాఖ తెలిపింది.

80.45 శాతం కోలుకున్నోళ్లు

సోమవారం మరో 2,180 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా, ఇప్పటివరకూ కరోనా బారినపడి ఆరోగ్యవంతులుగా మారినవారి సంఖ్య 1,29,187కు చేరుకుంది. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో కోలుకున్నవారు 80.45 శాతంగా నమోదు కాగా, ఈ విషయంలో జాతీయ సగటు 78.26 శాతం. తాజాగా మరో 10 మంది కొవిడ్‌తో కన్నుమూయగా, మొత్తంగా మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 984కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,400 మంది కరోనాతో చికిత్స పొందుతుండగా, వీరిలో ఐసొలేషన్లలో వైద్యసేవలు పొందుతున్నవారు 23,534 మంది ఉన్నారు.

ఆరు జిల్లాల్లో 100కి పైగా..

సోమవారం నాటి ఫలితాల్లో 6 జిల్లాల్లో 100కిపైగా కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్‌)లో 277 పాజిటివ్‌లను నిర్ధారించగా, రంగారెడ్డి(143), కరీంనగర్‌(135), వరంగల్‌ నగర(108), సిద్దిపేట(106), ఖమ్మం(103) జిల్లాల్లో ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 50 పాజిటివ్‌లు నిర్ధారించిన వాటిలో మేడ్చల్‌ మల్కాజిగిరి(97), నల్గొండ(96), నిజామాబాద్‌(84), భద్రాద్రి కొత్తగూడెం(75), మహబూబాబాద్‌(68), సూర్యాపేట(62), యాదాద్రి భువనగిరి(53), జగిత్యాల(52) జిల్లాలున్నాయి.

హోం ఐసొలేషన్‌లో బండి సంజయ్‌

పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు దిల్లీకి వెళ్లిన భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ హోంఐసొలేషన్‌లో ఉన్నారు. భాజపా తెలంగాణ ఇన్‌ఛార్జి కృష్ణదాస్‌కు కరోనా సోకడంతో సంజయ్‌ ముందుజాగ్రత్తగా సమావేశాలకు వెళ్లకుండా దిల్లీలో నివాసానికి పరిమితమయ్యారు.

ఇదీ చదవండిఃస్వీయ నిర్బంధంలోకి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details