Rythu Bandhu Funds: పంట పెట్టుబడి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు త్వరలో రైతులకు అందనుంది. యాసంగి సీజన్‌కు సంబంధించిన సాయాన్ని ఈనెల 28 నుంచి అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రూ.7,600 కోట్ల పైగా సాయం..
గత సీజన్‌తో పోలిస్తే ఈ మారు రైతుబంధు సాయం పొందే లబ్ధిదారుల సంఖ్యతో పాటు అందించే నగదు మొత్తం కూడా పెరగనుంది. కొత్త పట్టాదారు పాసుపుస్తకాల జారీతో లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. సాగు చేసే భూముల విస్తీర్ణం కూడా పెరిగింది. బ్యాంకు ఖాతాలు, ఆధార్ అనుసంధానం కూడా పూర్తికావడంతో రైతుబంధు సాయం పొందే వారితో పాటు భూవిస్తీర్ణం పెరిగింది. వానాకాలం సీజన్లో 61.08 లక్షల మందికి 7,377 కోట్ల రూపాయలు రైతుబంధు సాయంగా అందించారు. యాసంగి సీజన్లో లబ్ధిదారుల సంఖ్య 66.56 లక్షలకు పెరిగింది. వారికి రూ.7,600 కోట్ల పైగా సాయం అందనుంది. సాగయ్యే భూముల విస్తీర్ణం పెరగడంతో మరో 300 కోట్ల మేర అదనంగా రైతుబంధు సాయాన్ని ప్రభుత్వం అందించనుంది.