ప్రభుత్వానికి నివేదికలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు పంపించేందుకు ప్రధాన కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది కీలకమైన విధులు నిర్వర్తిస్తుంటారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రజాప్రతినిధులు, సందర్శకులు తరుచూ కార్యాలయాలకు వచ్చిపోతుడటం.. వైరస్ వ్యాప్తి భయం సిబ్బందిని మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. రాష్ట్ర సచివాలయంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు, ఉన్నత-ప్రాథమిక విద్య, విద్యుత్తు, నీటిపారుదల శాఖలు కలిపి ఇప్పటి వరకు 500 మందికి పైగా కరోనా సోకింది. ముఖ్యంగా కరోనాపై పోరాటంలో ముందు వరసలో ఉండే వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు శాఖల్లో విధుల సందర్భంగా ఎంతోమంది వైరస్‌కు గురయ్యారు.
భయం భయం: ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా వణుకు - తెలంగాణలో కరోనా వార్తలు
ప్రభుత్వాన్ని నడిపించే శాఖల ప్రధాన కార్యాలయాలకు కరోనా గుబులు పట్టుకుంది. వరసగా అధికారులు, సిబ్బంది వైరస్ బారిన పడుతున్నారు. దాదాపు అన్ని కార్యాలయాల్లో ఇదే పరిస్థితి. వివిధ శాఖల్లో పనిచేసే సుమారు 500 మందికి వైరస్ సోకడం అధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది.
ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలకు వస్తున్న ఉద్యోగులు, సిబ్బంది మనసులో ఒకింత ఆందోళనతోనే కనిపిస్తున్నారు. ఒకరిని ఒకరు కలవడం మానేశారు. వీలైనంతవరకు అటెండర్లు, సహాయకులను అధికారులు ఛాంబర్లకు రానివ్వడం లేదు. కేసుల ఉద్ధృతి పెరగడంతో వారంరోజుల నుంచి ప్రభుత్వ ప్రధాన శాఖల కార్యాలయాల ఎదుట సందర్శకులకు అనుమతి లేదనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. జిల్లాల నుంచి, ఇతర కార్యాలయాల నుంచి వస్తున్న వారిని, ప్రజాప్రతినిధులను కార్యాలయాల్లోకి అనుమతించడం లేదు. ఏదైనా పని ఉంటే అనుమతి తీసుకునే రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.