తెలంగాణ

telangana

ETV Bharat / city

NTSE: విద్యార్థులకు మరింత కఠినంగా జాతీయ ప్రతిభ అన్వేషణ పరీక్ష..! - ఎన్‌టీఎస్‌ఈ

జాతీయ స్థాయిలో పాఠశాల విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి.. ఉన్నత చదువుల వైపు ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న జాతీయ ప్రతిభ అన్వేషణ పరీక్ష(ఎన్‌టీఎస్‌ఈ) మరింత కఠినం కానుంది. అదే సమయంలో ఎక్కువమందికి అవకాశం కల్పించాలని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) భావిస్తోంది. ఈ పరీక్షపై ప్రతి మూడేళ్లకు ఒకసారి కమిటీ సమీక్షించి సిఫారసులకు అనుగుణంగా మార్పులు చేస్తారు. జాతీయ ప్రతిభ అన్వేషణ పథకం(ఎన్‌టీఎస్‌ఎస్‌) సమీక్ష కమిటీ సమావేశం ఇటీవల నిర్వహించారు. పలు అంశాలపై చర్చించి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. వీటిలో పలు అంశాలు 2022 పరీక్ష నుంచి అమలులోకి రావొచ్చని భావిస్తున్నారు.

more rigorous national talent search test for students
more rigorous national talent search test for students

By

Published : Aug 31, 2021, 7:10 AM IST

పదో తరగతి చదివే విద్యార్థులకు ఏటా ఎన్‌టీఎస్‌ఈ నిర్వహిస్తారు. మొదటిస్థాయి పరీక్షను రాష్ట్ర స్థాయిలో ఎస్‌ఎస్‌సీ బోర్డు జరుపుతుంది. అందులో ప్రతిభావంతులను జాతీయస్థాయిలో జరిగే రెండో స్థాయి పరీక్షను ఎన్‌సీఈఆర్‌టీ నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా 8 వేల మందిని ఈ పరీక్షకు ఎంపిక చేసి అందులో ప్రతిభ చూపిన 2 వేల మందికి ఉపకార వేతనం ఇస్తారు. ఇంటర్‌లో నెలకు రూ.1250 చొప్పున, డిగ్రీ, పీజీలో నెలకు రూ.2 వేల చొప్పున అందజేస్తారు. పీహెచ్‌డీకి కూడా స్కాలర్‌షిప్‌ అందిస్తారు. తెలంగాణ, ఏపీల నుంచి ఏటా 50 వేల మందికి పైగా విద్యార్థులు ఎన్‌టీఎస్‌ఈ రాస్తారు. అందులోంచి జాతీయ స్థాయిలో జరిగే రెండో స్థాయి పరీక్షకు తెలంగాణ నుంచి 216 మందిని, ఏపీ నుంచి 266 మందిని ఎంపిక చేస్తారు.

కమిటీ కీలక సిఫారసులు

  • రెండో స్థాయి(జాతీయ) పరీక్షలో ఒకటికి మించి సరైన సమాధానాలు ఉండే 10-15 శాతం ప్రశ్నలివ్వాలి. బహుళ ఐచ్ఛిక ప్రశ్నలకు ప్రస్తుతం నాలుగు ఆప్షన్లు ఇచ్చి అందులో ఒకటి సరైన దాన్ని గుర్తించాలని అడుగుతున్నారు. కానీ ఇంకా ఎక్కువ ఇవ్వాలి.
  • తప్పు జవాబులకు నెగెటివ్‌ మార్కులు ఉండాలి. కొన్ని వైవిధ్యమైన, సృజనాత్మకతతో కూడిన ప్రశ్నలను ఇవ్వాలి.
  • గత అయిదేళ్ల పరీక్షలను పరిశీలిస్తే రెండోస్థాయి పరీక్ష రాసే బాలికల సంఖ్య తక్కువగా ఉంది. ఇతర సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలి. ఇప్పుడు రెండో స్థాయిలో పరీక్ష రాసిన ప్రతి నలుగురి నుంచి ఒకరిని ఎంపిక చేస్తున్నారు. దాన్ని 1:8 లేదా 1:10 నిష్పత్తికి పెంచాలి.
  • కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా రెండో స్థాయి పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో జరపాలి.
  • రాష్ట్ర స్థాయిలో జరిపే మొదటి స్థాయి పరీక్షలో మెంటల్‌ ఎబిలిటీ టెస్టు(మ్యాట్‌), స్కాలరిస్టిక్‌ ఎబిలిటీ టెస్టు(శాట్‌)లో డైరెక్టు ప్రశ్నలు ఇస్తున్నారు. ఆ విధానాన్ని మార్చి విద్యార్థుల్లో నిజమైన సామర్థ్యాన్ని(కాంపిటెన్సీ బేస్డ్‌) వెలికితీసేలా ప్రశ్నల విధానం ఉండాలి.
  • రెండో స్థాయి పరీక్షను ప్రతి రాష్ట్రంలో ఒకటీ లేదా రెండు నగరాల్లో జరుపుతున్నారు. పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచాలి.
  • ఐదో తరగతి నుంచే ప్రతిభను గుర్తించేలా పరీక్షలు జరపాలి. విదేశాల్లో ప్రస్తుతం అమలు చేస్తున్నట్లు 5, 8 తరగతుల్లో కూడా పరీక్షలు జరపాలి.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details