హైదరాబాద్ నగరంలో 40 ప్రాంతాల్లో ఉన్న ఛార్జింగ్ కేంద్రాలకు తోడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 138 కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రం నుంచి రాకపోకలు సాగించే మూడు ప్రధాన జాతీయ రహదారుల్లో ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి చొప్పున అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌రెడ్‌కో) కసరత్తు చేస్తోంది. ఏటా 200 చొప్పున రానున్న మూడేళ్లలో 600 ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటు చేయనున్నారు.
1,087.45 కిలోమీటర్ల పరిధిలో..
దేశంలోని ప్రధాన నగరాల జాబితాలోని బెంగళూరు, పుణె, విజయవాడల మధ్య ప్రజల రాకపోకలు గణనీయంగా ఉన్న దృష్ట్యా 1,087.45 కిలోమీటర్ల పరిధిలో ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే వాహనదారులకు ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు నిర్ణయించారు. నాగ్‌పుర్- హైదరాబాద్- బెంగళూరు, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు- వరంగల్- జనగామ- హైదరాబాద్, పుణె- హైదరాబాద్- సూర్యాపేట- విజయవాడ మార్గాల్లో ఛార్జింగ్ కేంద్రాలకు డిమాండు ఉంటుందని అంచనా వేశారు.
కరీంనగర్, వరంగల్‌లలో మరో 20
కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చిన కరీంనగర్, వరంగల్‌లలోనూ విద్యుత్తు వాహనాలకు మెరుగైన అవకాశాలు ఉన్నాయని టీఎస్‌రెడ్‌కో గుర్తించింది. ఒక్కో నగరంలో 10 చొప్పున 20 ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిపై అధికారులు త్వరలో ప్రణాళిక రూపొందించనున్నారు.