కొవిడ్ రోగులకు సరికొత్త చికిత్స అందుబాటులోకి వచ్చింది. ‘మోనోక్లోనల్ యాంటీబాడీల’ (Monoclonal antibody therapy) రూపంలో ఆధునిక వైద్యం బాధితులకు భరోసానిస్తోంది. మెరుగైన ఫలితాలు లభిస్తున్నాయని వెల్లడవడంతో.. భారత ప్రభుత్వం తాజాగా ఈ చికిత్సకు అనుమతించింది. 2 లక్షల డోసులను దిగుమతి చేసుకోవడానికి ఒక ప్రైవేటు ఔషధ సంస్థకు పచ్చజెండా ఊపింది. దీంతో ఎక్కడో అమెరికాలో అనుసరిస్తున్న చికిత్స ఇప్పుడు మన దేశంలోనే కాదు.. మన రాష్ట్రంలోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ చికిత్సను పొందడం ద్వారా 7-10 రోజుల్లో వైరస్ శరీరం నుంచి మటుమాయమవుతుంది. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఇవ్వడం ద్వారా ముప్పు తీవ్రత ఎక్కువ ఉన్న వారికి అధిక ప్రయోజనం చేకూరుతుందనీ, అలా అని విచ్చలవిడిగా వినియోగిస్తే ఔషధ నిల్వలకు కొరత ఏర్పడే ప్రమాదం కూడా ఉందని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)(AIG) ఛైర్మన్, ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి తెలిపారు. మోనోక్లోనల్ చికిత్స తెలంగాణలో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో గురువారం ‘జూమ్’ మాధ్యమం ద్వారా ఆయన విలేకరులకు ఈ చికిత్స పద్ధతుల గురించి వివరించారు.
ఏమిటీ ఈ యాంటీబాడీలు..
‘‘శరీరంలో చాలా రకాల యాంటీబాడీలుంటాయి(antibodies). వైరస్‌కు వ్యతిరేకంగా పనిచేసేవి కొన్నే ఉంటాయి. అటువంటి వాటిలో ‘టసిరిబిమాబ్, ఇమిడెవిమాబ్’ అనే రెండు రకాలున్నాయి. వాటిని సేకరించి కొత్త యాంటీబాడీలను వృద్ధి చేస్తారు. ఇలా ప్రత్యేకంగా ఒకట్రెండు రకాలను మాత్రమే సేకరించి వృద్ధి చేసే విధానాన్ని మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటారు. ఈ రెండూ ఇంజక్షన్ల రూపంలో లభిస్తాయి. ఈ రెండింటినీ కలిపి ఒకే మోతాదులో శరీరంలోకి ఐవీ ద్వారా ఎక్కిస్తారు. దీని ధర ప్రస్తుతం సుమారు 70వేల వరకూ ఉంటుంది. ప్లాస్మాథెరపీలో చాలా రకాల యాంటీబాడీలుంటాయి. కానీ మోనోక్లోనల్‌లో రెండే రకాలుంటాయి. 5 ఎంఎల్ మోనోక్లోనల్ యాంటీబాడీలు ఇస్తే.. 5 లీటర్ల ప్లాస్మా(plasma) ఇచ్చిన దానితో సమానం.
నాడు ట్రంప్ తీసుకున్నది ఈ చికిత్సే..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(trump) కొవిడ్ బారిన పడినప్పుడు మోనోక్లోనల్ యాంటీబాడీలనే ఎక్కించారు. రెండు రోజుల్లోనే ట్రంప్ కోలుకున్నారు. వీటిని ఎవరికి పడితే వారికి ఇవ్వొద్దు. తగిన సమయంలో ఇవ్వడం ద్వారా వైరస్ లోడ్ గణనీయంగా తగ్గిపోతుంది.
ఎప్పుడు ఇవ్వాలంటే...
- వైరస్ లక్షణాలు కనిపించిన 3-7 రోజుల్లోపు ఈ ఇంజక్షన్ ఇవ్వాలి. దీని ద్వారా 7-10 రోజుల్లో వైరస్ శరీరం నుంచి మటుమాయమవుతుంది.
- వైరస్ సోకిన 10 రోజుల తర్వాత ఇస్తే అంత సానుకూల ప్రభావం ఉండదు. ఎందుకంటే అప్పటికే శరీరంలో వైరస్ లోడ్ బాగా పెరిగిపోయి ఉంటుంది.
- ఇంజక్షన్ ఇవ్వాలంటే ముందు తప్పనిసరిగా ఆర్‌టీ పీసీఆర్ పరీక్ష చేయించాలి.
- అందులో ‘సైకిల్ త్రెషోల్డ్(సీటీ)’ విలువను ప్రామాణికంగా తీసుకోవాలి.
- ఎన్ని సైకిల్స్‌లో వైరస్‌ను గుర్తించారనేది ముఖ్యం. ఉదాహరణకు 15 సైకిల్స్‌లో వైరస్‌ను గుర్తిస్తే.. వైరల్ లోడ్ ఎక్కువగా ఉందని అర్థం.
- అదే 30 సైకిల్స్‌లో వైరస్‌ను నిర్ధారిస్తే.. వారిలో లోడ్ తక్కువగా ఉందని తెలుస్తుంది.
- 15 సీటీ వ్యాల్యూ ఉన్నవారికి వారం తర్వాత 30కి తగ్గితే.. అప్పుడు ఆ ఇంజక్షన్ బాగా పనిచేసినట్లుగా గుర్తిస్తారు.
ఎవరికి ఇవ్వొద్దంటే...
- ఆసుపత్రిలో చేరి ఆక్సిజన్ సాయంతో.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నవారికి..
- బహుళ అవయవాలు దెబ్బతిన్నవారికి
- గర్భిణులకు(pregnant women) కూడా ఇవ్వకూడదు.