Money cheating: మా సంస్థలో ఏజెంటుగా చేరండి. మీ కింద మరికొందర్ని చేర్చండి. వాళ్ల పరిధిలో ఇంకొందర్ని చేర్చుకోమని చెప్పండి. ఇలా మీ బృందాన్ని విస్తరించుకుంటూ వెళ్తే.. వారు చేసే మొత్తం వ్యాపారంపై మీకు ఇబ్బడిముబ్బడిగా కమీషన్ వస్తుంది. కొద్ది రోజుల్లోనే రూ.కోట్లు కళ్ల చూడొచ్చు’ అంటూ కొన్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థలు ఉచ్చులోకి లాగుతాయి. కొన్ని సంస్థలేమో ఉత్పత్తుల విక్రయాల పేరిట, మరికొన్ని డిపాజిట్ల సేకరణకు ఈ పద్ధతి అనుసరిస్తున్నాయి. లావాదేవీల విలువ వందల కోట్లకు చేరుకునేసరికి ఏజెంట్లను, వారిని నమ్మి డబ్బులు కట్టిన జనాల్ని నట్టేట ముంచేస్తాయి. ఇలాంటి సంస్థలు ఇప్పుడు మొబైల్ యాప్స్ ద్వారా గొలుసుకట్టు మోసాలకు పాల్పడుతుండటం కొత్త పోకడ.
మల్టీ లెవెల్ మార్కెటింగ్..
- ఏపీలోని నెల్లూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన హెన్లీ ఇంటర్‌డినోమినల్ మిషన్ (హిమ్) ట్రస్టు రూ.70 కోట్ల మేర మోసానికి పాల్పడింది. రూ.10,500 చెల్లించి తమ సంస్థలో సభ్యుడిగా చేరితే నెలకు రూ.2,700 చొప్పున రెండు నెలలు, నెలకు రూ.5,400 చొప్పున ఆ తర్వాత తొమ్మిది నెలలు చెల్లిస్తామంటూ మోసానికి తెరలేపింది.
పెట్టుబడి పేరిట బురిడీ...
- మీ పెట్టుబడి నెలల్లోనే రెట్టింపు కావాలనుకుంటున్నారా? మా సంస్థలో డిపాజిట్టు చేయండి’ అంటూ వల విసురుతారు. ఎక్కడా లభించనంత వడ్డీ గిట్టుబాటవుతుందని ఆశ చూపిస్తారు. రెండు, మూడు నెలలు పక్కాగా చెల్లించేస్తారు. ఎక్కువ మంది డిపాజిట్లు చేశాక బోర్డు తిప్పేస్తారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు కేంద్రంగా ఏర్పాటైన వర్ధన్ కోఆపరేటివ్ బ్యాంకు.. తమ దగ్గర డబ్బులు డిపాజిట్టు చేస్తే ఏడాదిలోనే రెట్టింపు చెల్లిస్తామని, 50 శాతం రాయితీపై వాహనాలు ఇప్పిస్తామంటూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసింది. ఆనక బోర్డు తిప్పేసింది. ‘మా సంస్థలో రూ.10 వేలు డిపాజిట్టు చేయండి. దానిపై వంద రోజులపాటు రోజుకు రూ.200 ఆదాయం పొందండి’ అంటూ నెల్లూరు జిల్లా వేదాయపాళెం కేంద్రంగా ఏర్పాటైన వెల్‌పే సంస్థ ఏడు నెలల్లో రూ.85 కోట్లు వసూలు చేసింది. 12 వేల మందిని మోసగించింది. ఈ రెండు సంస్థలపై కేసులు నమోదయ్యాయి.
చిట్టీలు కట్టించుకుని చెక్కేస్తున్నారు...
- ప్రతి నెలా చిన్న చిన్న మొత్తాల్లో చిట్టీ కట్టుకోండి.. మీకు అవసరమైనప్పుడు ఒకేసారి పెద్ద మొత్తం పొందొచ్చు’ అంటూ పరిచయస్తులు, స్నేహితుల ద్వారా డబ్బులు కట్టించుకుంటుంటారు. కొంతకాలం బాగానే చెల్లిస్తారు. చిట్టీల సంఖ్య పెరిగి, కొంచెం డబ్బు చేతికి అందగానే ఒక్కసారిగా ఉడాయిస్తుంటారు. విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన శుభదర్శి చిట్‌ఫండ్ ప్రజల నుంచి రూ.18 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడిందని, పూజిత చిట్‌ఫండ్స్ డబ్బులు చెల్లించకుండా మోసం చేసిందని, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో అరుణోదయ చిట్‌ఫండ్ రూ.11.70 కోట్లు వసూలు చేసి, 916 మందిని మోసగించిందని కేసులు నమోదయ్యాయి.