తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆదా చేయడమే ఆదాయం.. ఇదే ఆధునిక నారీమణుల మంత్రం - saving is income

నగరాలు, పట్టణాల్లో ఒకరి సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకురావటం కష్టమే. మధ్యతరగతిలో దంపతులిద్దరూ సంపాదిస్తేనే సాఫీగా సాగుతుంది. ఈ తరుణంలో కరోనా పెను ప్రభావం చూపింది. ఉద్యోగాలు కోల్పోయిన వారు ఎందరో. ఇప్పుడిప్పుడే కొద్దిమంది తేరుకుంటున్నారు. వృథా ఖర్చులు తగ్గించుకుంటూ చిన్న చిట్కాలతో పొదుపు బాట పడుతున్నారు. సరదాలకు, వినోదాలకు దూరమవుతున్నారు. ఆదా చేయడమే ఆదాయంలా భావించి ముందుకు సాగవచ్చని గృహిణులు, నిపుణులు సూచిస్తున్నారు.

modern women savings policy
ఆదా చేయడమే ఆదాయం

By

Published : Oct 11, 2020, 7:37 AM IST

లాక్‌డౌన్‌లో చాలామంది ఇళ్లు ఖాళీ చేసి ఊళ్లకెళ్లిపోయారు. కాస్త తక్కువకే అద్దె ఇళ్లు దొరుకుతున్నాయి. కొన్నిచోట్ల గతంలో రూ.12 వేలు ఉన్న రెండు పడక గదుల ఇల్లు ఇప్పుడు రూ.10 వేలకే ఇస్తున్నారు. ఇలాంటి ఇళ్లకు మారితే కొన్ని నెలలపాటు రూ.2 వేలైనా ఆదా చేయొచ్ఛు

అవసరమే ముఖ్యం

భవిష్యత్తులో ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతో అవసరం లేని వాటిని కొనుగోలు చేస్తున్నవారు పెరుగుతున్నారు. ఈ ధోరణి సరికాదు. పప్పులు ఎలుకలు, బొద్దింకల పాలిట పడుతుంటాయి. ఇంటి అవసరాలు గమనిస్తూ ఖర్చు చేస్తే ప్రతి నెలా రూ.వెయ్యి-రూ.2 వేల వరకు ఆదా అవుతుంది.

ఎక్కడ కొనాలి.. ఎంత వండాలి

రైతుబజార్లలో ఆకుకూరలు, కూరగాయలు తక్కువ ధరకే లభ్యమవుతుంటాయి. వారానికొకసారి కొంటే నెలకు రూ.వెయ్యి వరకు ఆదా చేయొచ్ఛు మాంసం, చేపలు హోల్‌సేల్‌ మార్కెట్లలో కొనడం మేలు. ఇక్కడ కొంత తక్కువకు దొరుకుతాయి. కొందరు ఎక్కువెక్కువ వండి మిగిలినదంతా పారబోస్తుంటారు. ఎంత కావాలో అంత వండుకోవడం ఉత్తమం.

రాయితీలు చూడండి

సేల్స్‌ క్లియరెన్సు, పండగల సమయంలో వస్తువులు రాయితీలకు లభిస్తాయి. దుస్తులు, పచారీ సామగ్రి 20-30 శాతం తక్కువకు వస్తుంటాయి. ఆన్‌లైన్‌లో వివిధ ఇ-కామర్స్‌ సంస్థలు పండగల్లో ఎన్నో ఆఫర్లు ఇస్తుంటాయి. నిర్ణీత మొత్తంలో వస్తువులు కొంటే రూపాయికే కొన్ని వస్తువులు అందిస్తుంటాయి. ఇలాంటి వాటిని అందిపుచ్చుకోవాలి.

అప్రమత్తత.. అన్నింటా ఆదా

  • ఒకటో తేదీ ఇంటి బడ్జెట్‌ తయారు చేసుకోవాలి.
  • నెలవారీ సరకులపై ప్రణాళిక వేసుకోవాలి.
  • అవసరం మేరకే మొబైల్‌కి రీఛార్జ్‌ చేయించాలి.
  • ఇంటి ఆహారానికే ప్రాధాన్యతనివ్వాలి.
  • భవిష్యత్తు అవసరాలకు నగదు నిల్వచేసుకోవాలి
  • కరోనా వైద్యానికి ఆరోగ్య బీమా చేయించుకోవాలి.
  • కలిసి భోంచేస్తే గ్యాస్‌, విద్యుత్తు ఆదా అవుతాయి.
  • పిల్లలనూ పొదుపులో భాగస్వాములను చేయాలి.

గుర్తెరిగి దాచుకో

రేపటి అవసరాలకు ఆదాయంలో కొంత దాచుకోమంటూ తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చాయంటారు ఇంటీరియర్‌ డిజైనర్‌ ప్రదీప్‌. పదేళ్లలో తొలిసారి భార్యతో కలసి ఇంటి బడ్జెట్‌ను తయారు చేశానంటున్నారు. ఇప్పటివరకూ తాను రోజూ చిరుతిండ్లు, సిగరెట్లు వంటి వాటికి ఎంత ఖర్చు చేసేవాడినో గుర్తించానని చెబుతున్నారు. వాటిని ఒకేసారి తగ్గించటం సాధ్యపడక పోయినా క్రమంగా తగ్గించుకుంటూ రావటం వల్ల అప్పులు చేయాల్సిన పనిలేకుండా ఉందని తన అనుభవాన్ని పంచుకున్నారు.

సకాలంలో బిల్లులు చెల్లించాలి

తాగునీరు, ఇంటర్నెట్‌, మొబైల్‌ఫోన్లు, విద్యుత్‌, క్రెడిట్‌ కార్డు బిల్లుల్ని సకాలంలో చెల్లించాలి. లేదంటే సర్‌ఛార్జీలు విధిస్తుంటారు. ఉదాహరణకు విద్యుత్తు బిల్లు చెల్లింపు ఒకరోజు ఆలస్యమైనా రూ.25 అదనంగా చెల్లించాలి

ABOUT THE AUTHOR

...view details