తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇక నుంచి ఇంటి వద్దకే చేపల ఉత్పత్తులు.. - mobile fish and fish products sales in telangana

ఆహార ప్రియులకు శుభవార్త. కొవిడ్‌ నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో ఆరోగ్య స్పృహ, రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవాలన్న తపన పెరిగిన వేళ.. భాగ్యనగరం సహా అన్ని జిల్లా కేంద్రాల్లో మత్స్య ఉత్పత్తులు ఇంటి వద్దకే రానున్నాయి. నగర, పట్టణ వినియోగదారుల సౌకర్యార్థం ఆధునిక సంచార చేపల విక్రయ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. మత్స్య శాఖ, ఎన్​ఎఫ్​డీబీ ఆర్థిక సాయంతో... మొబైల్ ఔట్‌లెట్లను మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నాణ్యమైన తాజా చేపలు, రొయ్యలు ప్రజలకు అందించడంతోపాటు మత్స్యకార కుటుంబాల్లో... ఆర్థిక జీవనప్రమాణాలు పెంపు లక్ష్యంగా ప్రభుత్వం చొరవ తీసుకుంది.

talsani, mobile fish vehicles
సంచార చేపల విక్రయ వాహనాలు, చేపల ఉత్పత్తులు

By

Published : Mar 28, 2021, 12:27 PM IST

రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ మత్స్య రంగానికి పెద్దపీటవేసిన సర్కారు.. మత్స్యకార కుటుంబాల ఆర్థిక పరిపుష్టిపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత గ్రామీణ కులవృత్తులపై శ్రద్ధ తీసుకుంటున్న క్రమంలో... ప్రత్యక్షంగా పరోక్షంగా 40 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్న ఈ రంగం అభ్యున్నతి కోసం చర్యలు తీసుకుంటోంది. ఏటా ఉచిత చేపల పిల్లల పంపిణీ చేస్తున్న మత్స్య శాఖ.. నీటి వనరులు, చెరువుల్లో ఆ వేట అనంతరం అమ్ముకోవడానికి ద్విచక్ర వాహనాలు, శీతలీకరణ బాక్సులు, ఐస్ పెట్టెలు పంపిణీ చేసింది.

తాజాగా హైదరాబాద్‌ నెక్లెస్ రోడ్‌ హెచ్‌ఎండీఏ మైదానంలో... సంచార చేపల విక్రయ వాహనాలను మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జీహెచ్‌ఎంసీ సహా 29 జిల్లాలకు కలిపి మొత్తం 117 మొబైల్ ఔట్‌లెట్లు మత్స్యకార మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. కొవిడ్ నేపథ్యంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే మత్స్య ఉత్పత్తులు ఆహారంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్న తరుణంలో.. ఈ అవకాశం కల్పించడం పట్ల లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతోన్నాయి.

వీధుల్లోకి చేపలు

విశ్వనగరంగా ఆవిర్భవించిన హైదరాబాద్‌లో.. నాణ్యమైన చేపలు, రొయ్యలు దొరకాలంటే పెద్ద గగనమే. భారీ డిమాండ్ ఉన్నప్పటికీ... ఆరోగ్యకర ఉత్పత్తులు దొరకవు. అవి కావాలంటే రాంనగర్‌, బేగంబజార్‌, కూకట్‌పల్లి వంటి టోకు మార్కెట్లకు వెళ్లాల్సిందే. ఇక తాజాగా సంచార చేపల విక్రయ వాహనాలు అందుబాటులోకి వచ్చిన దృష్ట్యా.. నాణ్యమైన చేపలు, రొయ్యలతోపాటు... రెడీ టూ కుక్, రెడీ టూ ఈట్, బిర్యానీ, రుచికరమైన కూరలు, పులుసు, ఇతర ఉత్పత్తులు వినియోగదారుల వీధుల్లోకి వస్తాయి. ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన ఈ ఒక్కో వాహనంలో.. వేయింగ్ మిషన్, కటింగ్ టేబుల్, గ్యాస్ స్టవ్‌, రిఫ్రిజిరేటర్ వంటి సామాగ్రి పొందుపరచడం ఓ ప్రత్యేకత. మొదటి విడతలో జీహెచ్‌ఎంసీలో 73.. జిల్లాల్లో 44 సంచార చేపల విక్రయ వాహనాలు లబ్ధిదారులకు అందజేసింది. అవే కాకుండా 13 జిల్లాలకు చెందిన 17 మత్స్యపారిశ్రామిక మహిళా సంఘాలకు.. పొదుపు, వ్యాపారం బట్టి ఒక్కో సొసైటీకి 3 లక్షలు, 6 లక్షల రూపాయల చొప్పున సాయం అందించారు.

ప్రాజెక్టుల వద్ద సంచార వాహనాలు

ఏటా ఉచిత చేప పిల్లల పంపిణీలో భాగంగా గత ఏడాది 18,500 చెరువుల్లో విత్తనం చల్లడం, ఇతర ప్రోత్సాహకాల వల్ల ఈ ఏడాది 3.5 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి సాధించింది. ఈ ఏడాది 25 వేల చెరువుల్లో చేప పిల్లలు విడుదల చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నందున.. 4 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి దాటనుంది. జీహెచ్‌ఎంసీ సహా రాష్ట్రవ్యాప్తంగా మరో 500 వరకు సంచార చేపల విక్రయ వాహనాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న దృష్ట్యా.. ప్రతి రిజర్వాయర్ ఒక టూరిజం హబ్‌గా అవతరించడంతో... ఆయా ప్రాజెక్టుల వద్ద కూడా ఇవి ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నామని మత్స్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ ఏడాది బడ్జెట్‌లో సమీకృత మార్కెట్ల కోసం 500 కోట్ల రూపాయలు కేటాయించిన దృష్ట్యా.. నిర్మాణం పూర్తి చేసి వెజ్‌, నాన్‌ వెజ్‌ ఉత్పత్తులు విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆరోగ్య తెలంగాణలో భాగంగా... ప్రొటీన్ , విటమిన్లు, మినరల్స్, అమీనో యాసిడ్స్ విలువలు గల చేపల సగటు వినియోగం పెంచాలని సర్కారు భావిస్తోంది.

ఇంటి వద్దకే చేపల ఉత్పత్తులు

ABOUT THE AUTHOR

...view details