సామాన్యుల జీవనోపాధికి జీవనాడిగా తిరిగే ఎంఎంటీఎస్ రైళ్లు నడవకపోవడతో మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ముంబయులో పరిమిత సంఖ్యలో లోకల్ రైళ్లు నడుస్తున్న వేళ.. నగరంలోనూ అలాగే నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. 121 సేవలకు బదులు సగం రైళ్లు అయినా తిరిగితే ఉపశమనంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఎంఎంటీఎస్‌కు సేవల్లో జాప్యం.. ఇబ్బందులు పడుతున్న జనం... - MMTS services
మెట్రో నడుస్తోంది.. ఆర్టీసీ బస్సులు, ఆటోలు తిరుగుతున్నాయి. క్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. భాగ్యనగరవాసికి అందనిది ఎంఎంటీఎస్ ఒక్కటే. అన్నిటికంటే తక్కువ ధరతో ప్రజలకు చేరువైన ఈ రైళ్లు ఆగిపోయి ఏడు నెలలు దాటింది. లాక్‌డౌన్‌లో ఆగిన రైళ్లు అన్‌లాక్-5లో కూడా అందుబాటులోకి రాలేదు.
అతి తక్కువ టిక్కెట్ ధరతో నడిచే ఎంఎంటీఎస్‌లను పరుగులు పెట్టించేలా ద.మ. రైల్వేపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడంలేదు. ఆ దిశగా రైల్వేకు సూచించిన దాఖలాలు కూడా లేవు. ప్రయాణికులు తక్కువగా ఉన్నారు.. వీరికోసం రైల్వే వ్యవస్థను మొత్తం వినియోగించేందుకు ద.మ. రైల్వే సిద్ధంగా లేదు. నగరంలో 26 ఎంఎంటీఎస్ స్టేషన్లున్నాయి. ఈ స్టేషన్లలో కొవిడ్-19 నిబంధనలను అమలు చేయాలంటే చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. థర్మల్ స్క్రీనింగ్ చేసి ప్రయాణికులను పరీక్షించడంతో పాటు.. చివరి స్టేషన్లో ఆగినప్పుడు ఆ రైలును శానిటైజేషన్ చేయడం కూడా పెద్దపనిగా రైల్వే భావిస్తోంది. ఇన్ని చేసిన తర్వాత ప్రయాణికుల ద్వారా నిర్వహణ వ్యయం అయినా వస్తుందా? అనే ఆలోచనలో ద.మ. రైల్వే పడింది. పోనీ ఎక్కువమంది ప్రయాణికులు వస్తే నియంత్రించే వ్యవస్థ కూడా లేదు. ప్రతి 6 నిమిషాలకోసారి వచ్చే మెట్రో రైలుకోసం అంటే తర్వాత వచ్చే బండికోసం ఆపొచ్ఛు అరగంటకోసారి వచ్చే రైలు కోసం ప్రయాణికులను వెనక్కి పంపడం సమంజసం కాదనే ఆలోచనలో ద.మ. రైల్వే ఉంది. ఇలా అనేక సాకులు చూపించి రైల్వే చేతులెత్తేస్తే.. తప్పనిసరిగా రైళ్లు నడపాలనే నిబంధన పెట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. దీంతో ఎంఎంటీఎస్ రైళ్ల సేవలు ప్రయాణికులకు అందడంలేదు.
సామాన్యుల అవస్థలు పట్టని రైల్వే..
ఇప్పుడంతా ప్రత్యేక రైళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అవి కూడా ప్రయాణికుల డిమాండ్‌ను బట్టే నడుపుతున్నారు. అది కూడా 20 నుంచి 30 శాతం అదనపు ఛార్జీలతోనే. ఇలాంటి తరుణంలో రూ.5 కనిష్ఠ టిక్కెట్ ధర, రూ. 10 గరిష్ఠ టిక్కెట్ ధరతో ఎంఎంటీఎస్ రైళ్లను నడపడం వల్ల ప్రయోజనం ఏంటనే ఆలోచనలో రైల్వే ఉంది. కానీ నగర ప్రయాణికులు మాత్రం ఎంఎంటీఎస్‌ల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ కూడా అందుబాటులోకి వస్తుంది.. నగరం నలువైపులా ఎంఎంటీఎస్ పరుగులుంటాయని ఆశపడిన నగర ప్రయాణికులు.. మొదటి దశలో నడిచే రెండు మార్గాల్లో కూడా రైళ్లు నడవక ఉసూరుమంటున్నారు.