MLC ANANTHA: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడ జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం స్పెషల్ మొబైల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అంతకు ముందు కాకినాడ ఏఆర్ కార్యాలయంలో అనంతబాబును పోలీసులు విచారించారు. ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. ఈ విచారణ కోసం సుబ్రహ్మణ్యం ఇద్దరు స్నేహితులను పోలీసులు తీసుకెెళ్లారు. హత్య జరిగిన రోజు సుబ్రహ్మణ్యంతో ఉన్న ఇద్దరు స్నేహితులైన.. సుబ్రహ్మణ్యం, పవన్‌ను తమ ఇళ్లకు వచ్చి తీసుకెళ్లారని సుబ్రహ్మణ్యం తల్లి, పవన్ చెల్లి తెలిపారు. కాకినాడ ఎస్పీ కార్యాలయం వద్దకు ఆందోళనతో వచ్చిన సుబ్రహ్మణ్యం తల్లీ, పవన్ చెల్లి.. వారిద్దరి ఆచూకీ తెలపాలని ప్రాధేయపడ్డారు. అయితే.. ఇద్దరు యువకులూ తమ వద్దే ఉన్నారని పోలీసులు సర్దిచెప్పి పంపించారు.
ఇదీ జరిగింది :డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎమ్మెల్సీ....ఈనెల 19న కాకినాడ కొండయ్యపాలెంలో స్నేహితులతో కలిసి ఉన్న సుబ్రహ్మణ్యంను తన కారులో ఎక్కించుకుని వెళ్లారు. గతంలో ఆయన దగ్గరే డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యాన్ని మాట్లాడే పనుందంటూ తీసుకెళ్లారు. అర్థరాత్రి పన్నెండున్నర గంటలకు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ఉదయభాస్కర్ ఫోన్ చేసి ...నాగమల్లితోట వద్ద ప్రమాదం జరిగిందని చెప్పారు. సుబ్రహ్మణ్యాన్ని ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు వారిని అక్కడికి రమ్మని పిలిచాడు. మళ్లీ రాత్రి ఒకటిన్నర ప్రాంతంలో తన కారులోనే వెనకసీటులో సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని తీసుకుని తల్లిదండ్రులు కాపలాగా ఉండే అపార్ట్మెంట్ వద్దకు వచ్చారు.
సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడంటూ ఎమ్మెల్సీ చెప్పడంపై కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో చనిపోతే మృతదేహమంతా నీరుకారుతూ, ఇసుక ఎలా ఉందని నిలదీశారు. ఈ వ్యవహారం మొత్తం చూస్తే ఉదయభాస్కరే తన భర్తను చంపేశాడన్న అనుమాన్ని సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ వ్యక్తం చేశారు. పైగా నాగమల్లితోట వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని ఎమ్మెల్సీ చెప్పిన మాటలు అబద్దమనే తేలాయి. అసలు అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసుల విచారణలో తేలింది.