Raghunandan Rao Challenges Prashanth reddy : తెలంగాణ శాసనసభలో భాజపా ఎమ్మెల్యేలపై వివక్ష చూపెడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో ఏ సమస్యలు లేవన్నట్లుగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం దారుణమన్నారు. శాసనసభ సమావేశాలు మరీ రెండ్రోజులే నిర్వహించడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డిని మరమనిషి అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించడంపై.. నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. సభాపతి బీఏసీ నిబంధనలు పాటించడం లేదని రఘునందన్‌రావు వ్యాఖ్యానించారు.
Dubbaka MLA challenges Minister Prashanth Reddy : 'మాకు మూడ్రోజులు మాట్లాడే అవకాశం లభిస్తుందనుకున్నాం. కానీ మేం కుర్చీలు వెతుక్కునేలోపే ఆరు నిమిషాల్లో అసెంబ్లీ వాయిదా పడింది. బీఏసీ సమావేశానికి బీజేపీని కూడా పిలవాలని స్పీకర్‌ను కోరాం. గత ప్రభుత్వాలు సీపీఎం, లోక్‌సత్తా పార్టీల ఎమ్మెల్యేలు ఒక్కరే ఉన్నా వారిని కూడా బీఏసీ భేటీకి పిలిచారు. ఈ విషయాన్ని కూడా స్పీకర్ వద్దకు తీసుకెళ్లాం. అయినా ఆయన మమ్మల్ని సమావేశానికి అనుమతించలేదు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే బీఏసీ భేటీకి ఆహ్వానిస్తారో సభాపతి చెప్పాలి. మీరు ఇచ్చే నోటీసులను న్యాయపరంగా ఎదుర్కొంటాం.' అని రఘునందన్ రావు అన్నారు.