హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి (MLA Jagga Reddy) వెనక్కి తగ్గారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో చేలరేగిన వివాదం టీ కప్పులో తుఫాన్‌లా ముగిసింది. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో తేల్చేస్తానని జగ్గారెడ్డి (MLA Jagga Reddy) మంగళవారం మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై 24గంటలు గడవక ముందే మెత్తబడ్డారు.
నేను పోతే ఓట్లు పడుతాయా?
హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓడిపోవడంపై కాంగ్రెస్ నేతలు గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనేందుకు గాంధీభవన్‌కు వచ్చిన జగ్గారెడ్డి.. మీడియాతో మాట్లాడారు. పార్టీ సమావేశంలో అడగాల్సిన అన్నీ అంశాలు అడుగుతానని అన్నారు. పార్టీలో ఏదైనా లోటుపాట్లు ఉంటే ఎత్తి చూపుతానని స్పష్టం చేశారు. పార్టీ సహకారం ఉన్నా లేకున్నా తన సీటు గెలుచుకుంటానని వెల్లడించారు. మంచి మంచి వాళ్లు హుజూరాబాద్ వెళ్లి ప్రచారం చేసినా ఓట్లు పడలేదని... తాను పోతే ఓట్లు పడతాయా అని జగ్గారెడ్డి (MLA Jagga Reddy) ప్రశ్నించారు.