తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆ రెండు రోజులూ ఏం జరిగింది? - sajjanar encounter

పోలీసుల కస్టడీలో రెండు రోజులపాటు ఉన్న దిశ నిందితులు పోలీసుల దర్యాప్తులో ఏం చెప్పారన్నరన్నది కీలకాంశంగా మారింది. శుక్రవారం సీపీ సజ్జనార్ కేవలం రెండు రోజుల ముందే అంటే 4వ తేదీనే కస్టడీలోకి తీసుకున్నామని వెల్లడించారు. అంతకు ముందు నిందితులను ఎక్కడ ఉంచారన్నది గోప్యంగానే ఉంది. ​

mistary not reviled about 2 days of disha accused missing
ఆ రెండు రోజులూ ఏం జరిగింది?

By

Published : Dec 7, 2019, 7:48 AM IST

దిశ నిందితుల కథ ఎదురుకాల్పులతో ముగిసినా ఈ కేసులో ఇంకా అనేక అంశాలపై సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. రెండు రోజులపాటు పోలీసుల కస్టడీలో ఉన్న నలుగురు నిందితులు ఏం చెప్పి ఉంటారన్నది కీలకాంశం. తదుపరి దర్యాప్తులో భాగంగా న్యాయస్థానం పది రోజుల పోలీసు కస్టడీకి అనుమతించినప్పటికీ పోలీసులు మాత్రం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. కాల్పుల్లో మరణించిన తరువాత శుక్రవారం మాత్రం అప్పటికి రెండు రోజుల ముందే అంటే 4వ తేదీనే తాము వారిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. రెండు రోజుల పాటు నిందితులను ఎవరి కంటా పడకుండా విచారించి కేసుకు సంబంధించి పలు కీలక ఆధారాలను సేకరించారు.

ఇతర నేరాలతో సంబంధముందా?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితుల నుంచి తెలుసుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయని.. కనీసం పది రోజులపాటు వారిని విచారించాలని న్యాయస్థానంలో దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌లో పోలీసులు పేర్కొన్నారు. కేసు తీవ్రత దృష్ట్యా న్యాయస్థానం దీనికి అనుమతించింది. కేవలం రెండు రోజుల విచారణలోనే వీరి కథ ముగిసింది. పోలీసులు వీరినుంచి ఎలాంటి సమాచారం రాబట్టారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దిశ ఉదంతం పరిశీలించిన ఎవరికైనా ఇదేదో కరడుగట్టిన నిందితులు చేసిన పనే అని భావిస్తారు. ఆమెను కిడ్నాప్‌ చేయడం, సామూహికంగా అత్యాచారం చేయడం, హతమార్చి మృతదేహాన్ని కాల్చడం వంటివి చూస్తే మొదటిసారి నేరం చేసిన వారు ఇంతకు తెగించరనే భావన కలుగుతుంది. వీరు చేసిన నేరం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. గతంలోనూ వీరు ఇలాంటి నేరాలు చేసి ఉండవచ్చనే అనుమానం రేకెత్తింది. బాహ్య వలయ రహదారి చుట్టూ ఈ మధ్యకాలంలోనే కాలిపోయిన మూడు మహిళా మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులేవీ ఇంకా తేలలేదు. దాంతో వీటి వెనుక కూడా దిశ నిందితులు ఉన్నారేమో అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరిపారు. వీరు గతంలో ఇంకా ఏమైనా నేరాలు చేశారా అని నిందితులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దాంతోపాటు వారి వ్యక్తిగత వ్యవహారాలు, నేర ప్రవృత్తి ప్రబలడానికి గల కారణాలపై ఆరా తీసినట్లు సమాచారం.

నివృత్తి కావాల్సిన అంశాలు..

దిశ ఉదంతానికి సంబంధించి నివృత్తి చేసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. బలవంతంగా ముక్కు మూయడం వల్లనే ఊపిరాడకపోవడంతో దిశ మరణించిందని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఇదే సమయంలో వాహనం కోసం ఎదురుచూస్తున్న దిశను కిడ్నాప్‌ చేసి నాలుగడుగుల దూరంలో ఉన్న గోడ పక్కకు తీసుకెళ్లారు. కానీ వాస్తవానికి నిందితులు నలుగురూ ఆమెను సమీపంలో ఉన్న పాడుబడిన షెడ్డులోకి తీసుకెళ్లాలని భావించారు. అక్కడకు తీసుకెళ్లకముందే ఎందుకు హత్య చేశారు? మృతదేహాన్ని ఐదు గంటలపాటు తమతోనే ఉంచుకోవడంతో పాటు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చటాన్‌పల్లికి ఎందుకు తీసుకెళ్లారన్న అంశాలపై పలు అనుమానాలు ఉన్నాయి. రెండు రోజులపాటు పోలీసులు వీటి గురించి వారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఇవీచూడండి: మానసిక అత్యాచారాలెన్నో... మనసు పడే వేదనలెన్నో!

ABOUT THE AUTHOR

...view details