ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య కేవలం పది రోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 540 మంది అదృశ్యమవడం కలకలం రేపింది. వీరిలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోనే 303 మంది ఉండడం గమనార్హం. మహిళలు 276 మంది, బాలికలు 55, బాలురు 26, పురుషులు 183 మంది ఉన్నారు. 222 మంది ఆచూకీ లభించింది. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఒక్క నవంబరులోనే 38-40 మంది అదృశ్యమైనట్లు కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా రోజూ 60 మంది కనిపించకుండా పోతుంటే.. వారిలో అధికశాతం గ్రేటర్ పరిధిలోని వారే కావటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.
పొట్టకూటికి నగరానికి చేరింది ఆ కుటుంబం. ఆ ఇంటికి చెందిన బాలిక(16) చదువుకుంటూనే టీ స్టాల్‌లో తల్లికి సాయపడేది. ఓరోజు రాత్రి తల్లితో కలసి వెళుతూ రెప్పపాటులో మాయమైంది. వెతికినా ప్రయోజనం లేకపోయింది. రాత్రి 11 గంటలకు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిడ్డ కనిపిస్తుందని గంపెడాశతో ఇంటికెళ్లిన ఆ తల్లికి మరుసటి రోజు గుండె పగిలే వార్త తెలిసింది. ఖాళీ స్థలంలో ఓ మృతదేహం ఉందన్నది సమాచారం. అక్కడికెళ్లిన ఆ కన్నతల్లి కుప్పకూలింది. బలమైన గాయాలతో కుమార్తె నిర్జీవంగా పడిఉండడం చూసి బోరుమంది. |
పిల్లల కోసం తల్లి.. కూతురు కోసం తండ్రి
‘భర్తతో తాను విడిగా ఉంటున్నా. తనను నమ్మించి పిల్లలను చెన్నైకి తీసుకెళ్లిన భర్త ఇంతవరకు తిరిగి రాలేదు. దీంతో ఓ గృహిణి గతేడాది మే నెలలో జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంతవరకు వారి ఆచూకీ లభించలేదు. మరో మహిళ వివాహేతర సంబంధం నేపథ్యంలో ఇంటి నుంచి మరో వ్యక్తితో వెళ్లిపోయింది. ఆ మహిళ తండ్రి ఫిర్యాదు చేసి నెలలు గడుస్తోంది. ఇంతవరకు ఆచూకీ చిక్కలేదని తండ్రి వాపోయారు.
"యుక్తవయసు ఆడపిల్లలు మాయమైతే సజీవంగా ఇల్లు చేరేంత వరకూ తల్లిదండ్రులకు కంటి మీద కునుకు ఉండడంలేదు. అదృశ్యం కేసుల్లో అధికశాతం మహిళలు, యువతులే ఉండగా సగం మంది ఆచూకీ మాత్రమే లభిస్తోంది. మిగిలిన వారు వెతుకులాట పోలీసులకు సవాలుగా మారుతోంది."
- మా నాన్న బుద్దరాజు సత్యనారాయణరాజు(78)కు మానసిక స్థితి సరిగా లేదు. గతంలో ఒకసారి తప్పిపోతే పోలీసులు పట్టుకొని అప్పజెప్పారు. ఈ ఏడాది జూన్ 21న ఇంటి నుంచి వెళ్లి ఇంతవరకు రాలేదు. ఆచూకీ లభిస్తే ఈసారి తప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటాం. - వీఎస్ రాజు, కేపీహెచ్‌బీ 4వ ఫేజ్
- ఇంద్రానగర్ గుడిసెల్లో నివాసముంటున్న ఎ.గీత(40) 2017 మేలో ఇంటినుంచి వెళ్లింది. కూలీ పని చేసుకునే ఈమె ఆచూకీ రెండున్నరేళ్లయినా దొరకలేదు. ఇప్పటికీ తల్లి జయమ్మ బాలానగర్ పోలీసులను తరచూ అభ్యర్థిస్తూనే ఉంది. ఎక్కడికెళ్లిందన్నది అర్థం కావడంలేదని రోజు ఆమె గురించే ఆలోచిస్తున్నామని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. రాజు కాలనీకి చెందిన సంజీవరావు(36) మూడు నెలల క్రితం ఇంటినుంచి వెళ్లి తిరిగిరాలేదు. భార్య కరుణశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేయగా అతని ఆచూకీ లభ్యం కావడంలేదు.
మీకు తెలుసా
ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య కేవలం పది రోజుల వ్యవధిలో గ్రేటర్‌లోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 303 మంది అదృశ్యమయ్యారు.
పోలీస్ స్టేషన్లలో కేసుల వివరాలు...