Mirchi farmer : పొలంతో కళాశాలకు స్నేహం కుదిరింది. నాగలి, కంప్యూటర్ కలిసి పనిచేస్తున్నాయి. రైతుల వ్యవసాయ క్షేత్రమే విద్యార్థుల కార్యశాలగా మారిపోయింది. ఫలితంగా ఊహకందని ఫలితాలు కళ్లను గోచరిస్తున్నాయి.
విద్యార్థులు క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రజల సమస్యలపై ప్రాజెక్టు రిపోర్టు సమర్పిస్తే గుంటూరు జిల్లాలోని కేఎల్ వర్సిటీ 40 క్రెడిట్ పాయింట్లు కేటాయిస్తుంది. అందులో భాగంగా పల్నాడు ప్రాంతంలో కంప్యూటర్ సైన్సు విభాగం(సీఎస్‌ఈ) విద్యార్థులు పర్యటించారు.
ఇదీ గుర్తించారు
ఇక్కడ అనాదిగా మిర్చి సాగవుతోంది. రైతులు సాగునీటి కొరతతో అల్లాడుతున్నారు. అదే సమయంలో నీటి యాజమాన్య పద్ధతులు తెలియక బోలెడు నీటిని వృథా చేసుకుంటూ నష్టపోతున్నారని గ్రహించారు.
విద్యార్థుల చొరవ
నీటి వృథాకు సెన్సర్లతో అడ్డుకట్ట వేయొచ్చని విద్యార్థులకు అధ్యాపకులు సూచించారు. పరిమిత నీటితో మిర్చిని బిందుసేద్యం పద్ధతుల్లో సాగు చేసుకుంటే నీటి సమస్యే ఉత్పన్నం కాదని అగ్రికల్చర్ విభాగమూ సూచించింది. వెంటనే కంప్యూటర్ సైన్సు విభాగం ప్రధానాచార్యులు ఆచార్య సుబ్రహ్మణ్యం సమగ్ర నివేదిక తయారుచేసి దిల్లీలోని డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(డీఎస్‌టీ)కి పంపించారు.
దారి చూపిన నివేదిక
గుంటూరు జిల్లాలో ఏడాదికి సగటున 1,300 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. అది పల్నాడులో 700 మిల్లీమీటర్లే. ఇక్కడ దొరికే పరిమిత నీటితో వ్యవసాయం చేయాలంటే బిందు, సెన్సర్ పరిజ్ఞానం వినియోగం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని నివేదికలో పేర్కొన్నారు. రైతులను ముఖ్యంగా ఎస్సీలను సమూహంగా ఏర్పాటుచేసి, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం నేర్పించి, సహకార వ్యవసాయం చేయిస్తామన్నారు. దీనికి డీఎస్‌టీ మెచ్చుకుని 2021 జనవరిలో ప్రాజెక్టు మంజూరు చేసి రూ.1.03 కోట్లు కేటాయించింది. ప్రొఫెసర్లు నాగమల్లీశ్వరి, సంజీవయ్య, జేఆర్‌ఎఫ్(జూనియర్ రీసెర్చ్ ఫెలో) వైశాలి ప్రాజెక్టులో భాగస్వాములయ్యారు.