టెక్స్ టైల్ పరిశ్రమకు కేంద్రం ప్రకటించిన ప్రొడభన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకానికి మరిన్ని అంశాలను జోడించాలని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. పథకాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన కేటీఆర్... దీంతో చైనా నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి టెక్స్ టైల్ ఉత్పత్తులను కొనుగోలు చేసే వివిధ దేశాలను ఆకర్షించవచ్చని అన్నారు. పథకానికి మరిన్ని అంశాలు జోడించడం ద్వారా పరిశ్రమ పురోగతిని మరింతగా బలోపేతం చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పరిశ్రమకు ఉపయుక్తంగా మార్చేందుకు అవసరమైన పలు సలహాలు, సూచనలను లేఖలో తెలిపారు.
పథకం కింద ప్రోత్సాహకాలు మ్యాన్ మేడ్ ఫైబర్‌కు మాత్రమే వర్తిస్తాయని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా టెక్స్ టైల్ ఉత్పత్తుల్లో 50 శాతానికి పైగా ఉన్న కాటన్ సెగ్మెంట్‌ను పరిగణలోకి తీసుకోలేదని కేటీఆర్ అన్నారు. కాటన్ ఆధారిత టెక్స్ టైల్ ఉత్పత్తులు చేసే వారికి సైతం పథకం ద్వారా ప్రోత్సాహకాలు ఇస్తే అటు పరిశ్రమతో పాటు పత్తిని అధికంగా పండించే తెలంగాణ లాంటి రాష్ట్రాల్లోని రైతాంగం వరకు అందరికీ ఉపయుక్తంగా ఉంటుందని లేఖలో తెలిపారు. దీంతో అన్ని రకాల ఫైబర్‌తో కూడిన కొత్త పెట్టుబడులు టెక్స్ టైల్ రంగంలోకి వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు.
కాటన్ సెగ్మెంట్‌కూ ప్రోత్సాహకాలు ఇస్తే కేంద్రం ఈ రంగంలో ఆశిస్తున్న ఏడున్నర లక్షల ఉద్యోగాలు వేగంగా కల్పించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రోత్సాహకాలు పొందేందుకు నిర్ణయించిన నిర్ణీత కనీస పెట్టుబడిని తగ్గించాలని కేటీఆర్ కోరారు. మ్యాన్ మేడ్ ఫైబర్ సెగ్మెంట్లో 300 కోట్ల రూపాయల కనీస పెట్టుబడిని అర్హతగా నిర్ణయించారని... చైనా లాంటి దేశాలతో పోటీ పడాలంటే భారీ ఎత్తున ఈ రంగంలో పెట్టుబడులతో పాటు అధునాతన యంత్రాలతో పెట్టుబడులు పెట్టే చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తే బాగుంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. గార్మెంట్ రంగంలో నిర్ణయించిన కనీస 100 కోట్ల పెట్టుబడి పరిమితిని 50 కోట్లకు తగ్గించాలని కోరారు.