లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ నగర స్థానాన్ని మరింత సుస్థిరం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే లైఫ్ సైన్సెస్ ఫార్మా రంగానికి హైదరాబాద్ నగరం రాజధానిగా ఉందన్నారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ కేంద్రంగా ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో మరింత అభివృద్ధి జరిగేలా పలు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న బయో ఆసియా సదస్సు థీమ్‌ను ప్రకటించారు. వెబ్సైట్, బ్రోచర్‌ను ఆవిష్కరించారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ నరసింహారెడ్డి, లైఫ్ సైన్సెస్ సంచాలకులు, బయో ఆసియా సీఈవో శక్తి నాగప్పన్ పాల్గొన్నారు. రేపటి కోసం నేడు అన్న థీమ్‌తో 2020 బయోఆసియా సదస్సు జరుగుతుందని కేటీఆర్ తెలిపారు.
ఇప్పటికే ప్రపంచంలోని ప్రఖ్యాత లైఫ్ సైన్సెస్ కార్యక్రమాల్లో బయోఆసియా ఒకటిగా నిలిచిందని, ఈ సమావేశానికి దేశ, విదేశాల నుంచి ఫార్మా లైఫ్ సైన్సెస్ రంగ నిపుణులు ప్రతినిధులు హాజరవుతున్నట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రాజధానిగా ఎదగడంలో బయోఆసియా సదస్సు కీలకంగా నిలిచిందని అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు హెచ్ఐసీసీ వేదికగా జరగనున్న బయోఆసియా సమావేశానికి స్విట్జర్లాండ్ భాగస్వామి దేశంగా, జర్మనీ సంయుక్త భాగస్వామిగా ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. అసోం, కేరళ రాష్ట్రాలు రాష్ట్ర భాగస్వాములుగా సదస్సుకు హాజరవుతాయని చెప్పారు.