తెలంగాణ

telangana

ETV Bharat / city

గోదావరి-కావేరి అనుసంధానంపై ఈనెల 18న జలశక్తి శాఖ కీలక భేటీ - Godavari - Kaveri Link Project

Godavari Kaveri link project: జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఈ నెల 18న దిల్లీ శ్రమ శక్తి భవన్​లో గోదావరి-కావేరి అనుసంధానం ప్రాజెక్టుపై చర్చించనున్నారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి జలవనరుల శాఖ కార్యదరులు హాజరుకావాలని సమాచారం ఇచ్చారు.

Godavari
Godavari

By

Published : Feb 15, 2022, 7:48 PM IST

Godavari Kaveri link project: గోదావరి-కావేరి అనుసంధానం ప్రాజెక్టుపై 5 రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ సమావేశం నిర్వహించనుంది. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ నేతృత్వంలో నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి జలవనరుల శాఖ కార్యదరులకు ఆదేశాలు జారీ చేసింది. జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఈ నెల 18న దిల్లీ శ్రమ శక్తి భవన్​లో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశానికి హాజరు కావాలని పేర్కొంది.

కార్యాచరణ ప్రారంభించే దిశగా..

నదుల అనుసంధానం ప్రాజెక్టుల నినాదం కొత్తది కాకపోయినా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారిన జల అవసరాలు, వివిధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నదుల అనుసంధాన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర జలశక్తి శాఖలోని నేషనల్ వాటర్ డెవలప్​మెంట్ ఏజెన్సీ.. గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టును త్వరితగతిన చేపట్టేందుకు కార్యాచరణ ప్రారంభించింది.

అవసరాలను తీర్చటమే లక్ష్యంగా..

Rivers Linking Project in ap - telangana: గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరీ నదుల అనుసంధానం ద్వారా ఏపీ, తెలంగాణ, తమిళనాడులోని వివిధ ప్రాంతాల నీటి అవసరాలను పెద్ద ఎత్తున తీర్చేందుకు ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగస్వాములైన మూడు రాష్ట్రాలతోనూ కేంద్ర జలశక్తి శాఖ సంప్రదింపులు జరుపుతోంది. గోదావరిలోని ఇచ్చంపల్లి బ్యారేజీ నుంచి నాగార్జున సాగర్, సోమశిల, తమిళనాడులోని గ్రాండ్ ఆనికట్ వరకు నదులను అనుసంధానించనున్నారు. తద్వారా తెలంగాణలోని నల్గొండ, ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు తమిళనాడులోని తిరువళ్లూర్, వెల్లోర్, తిరువణ్ణామలై, విల్లుపురం, కడలూర్, కాంచీపురం లాంటి ప్రాంతాలకు నేరుగా నీటి ప్రాజెక్టులు అనుసంధానం కానున్నాయి. ఇక ఉప ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాలు, ఏపీలోని గుంటూరు, తమిళనాడులోని తంజావూర్ జిల్లాలకు ప్రయోజనం కలగనుంది. నాగార్జున సాగర్​తో పాటు మూసీ డ్యామ్ వద్ద జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా చేపట్టే అవకాశముందని కేంద్ర జలశక్తి శాఖ చెబుతోంది. ఈ అనుసంధానానికి తొలిదశలో 85 వేల కోట్ల రూపాయల మేర నిధులు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు.

1 కోటీ 35 లక్షల కోట్ల సంపద సృష్టి...!

వాస్తవానికి మహానది నుంచి వృథాగా సముద్రంలో కలుస్తున్న జలాలను గోదావరికి అటు నుంచి కృష్ణా, పెన్నా నదులకు అనంతరం కావేరీ నదికి అనుసంధాన కాలువల ద్వారా మళ్లించే అవకాశముందని జలశక్తి శాఖ చెబుతోంది. ఈ అనుసంధాన ప్రాజెక్టు ద్వారా ఏపీ, ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరిలకు ప్రయోజనం కలుగుతుందని కేంద్రం స్పష్టం చేస్తోంది. తొలిదశలో గోదావరిలోని ఇచ్చంపల్లి నుంచి కావేరీ వరకు 247 టీఎంసీల నీటిని మళ్లించే అవకాశముందని జలశక్తి శాఖ చెబుతోంది. గోదావరి బేసిన్​తో పాటు ఇతర బేసిన్​లలోని 9,44,572 హెక్టార్ల సాగులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. 1.40 లక్షల మందికి తాగునీరు, అలాగే పారిశ్రామిక అవసరాలకు నీటిని సరఫరా చేసే అవకాశముందని కేంద్ర జలశక్తి శాఖ భావిస్తోంది. రూ.85 వేల కోట్లు ఖర్చు అయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా 1 కోటీ 35 లక్షల కోట్ల సంపద సృష్టికి ఆస్కారం ఉందని కేంద్ర జలశక్తి శాఖ అంచనా వేస్తోంది.

ఇదీ చదవండి:బండి సంజయ్​, కిషన్​రెడ్డి క్షమాపణలు చెప్పితీరాల్సిందే..

ABOUT THE AUTHOR

...view details