తెలంగాణ

telangana

ETV Bharat / city

Ministry of Jal Shakti : 'కృష్ణా, గోదావరి'ని ఏం చేద్దాం? కేంద్రం తర్జనభర్జన! - water dispute between telangana and ap

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు కేంద్ర జల్​శక్తి మంత్రిత్వ శాఖ(Ministry of Jal Shakti) దిల్లీలో భేటీ అయింది. ఇరు బోర్డుల ఛైర్మన్లతో పాటు ఈ సమావేశానికి జల్​శక్తి, జలసంఘ అధికారులు హాజరయ్యారు.

గడువు పొడిగింపుపై కేంద్రం తర్జనభర్జన
గడువు పొడిగింపుపై కేంద్రం తర్జనభర్జన

By

Published : Sep 14, 2021, 7:13 AM IST

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు గడువుపై కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ(Ministry of Jal Shakti) తర్జనభర్జన పడుతోంది. జులై 15న జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం అక్టోబరు 14 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఏం జరిగాయి? ఇంకా చేయాల్సిందేమిటి? తదితర అంశాలపై చర్చించేందుకు కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ సోమవారం దిల్లీలో సమావేశాన్ని నిర్వహించింది. అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ వద్ద జరిగిన ఈ భేటీకి కృష్ణా,గోదావరి బోర్డుల ఛైర్మన్లు ఎం.పి.సింగ్‌, చంద్రశేఖర్‌ అయ్యర్‌తో పాటు జల్‌శక్తి, జలసంఘ అధికారులు హాజరైనట్లు తెలిసింది.

సీఎం కేసీఆర్ విజ్ఞప్తి..

నోటిఫికేషన్‌ అమలు గడువును పొడిగించాలని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర జల్‌శక్తి మంత్రిని కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూడా ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. నోటిఫికేషన్‌లోని రెండో షెడ్యూలులో పేర్కొన్న ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుల్లోని సిబ్బంది వివరాలు, యంత్రాలు, భవనాలు ఇలా అన్నీ పూర్తి స్థాయిలో స్వాధీనం చేయడంపై ఇప్పటివరకు రాష్ట్రాల నుంచి వచ్చిన స్పందన గురించి చర్చించినట్లు సమాచారం.

ముందస్తుగా నిధులివ్వలేం..

ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన ప్రాజెక్టుల్లోని సిబ్బంది వివరాలు మాత్రమే ఇచ్చి, మిగిలిన ప్రాజెక్టులను రెండో షెడ్యూలు నుంచి తొలగించాలని కోరింది. తెలంగాణ నుంచి దీనిపై ఎలాంటి సమాచారం రాలేదు. బోర్డులకు ముందస్తుగా నిధులు ఇవ్వలేమని రెండు రాష్ట్రాలు తేల్చి చెప్పాయి. ప్రాజెక్టుల వద్ద సీఐఎస్‌ఎఫ్‌ భద్రత గురించి కూడా రాష్ట్రాల నుంచి స్పందన లేదు. ఇలా అన్ని అంశాలకు సంబంధించి ఇద్దరు ఛైర్మన్లు నివేదించినట్లు సమాచారం.

గడువు పొడిగింపుపై మరోసారి చర్చ..

నోటిఫికేషన్‌ అమలుకు నెల రోజులు మాత్రమే గడువు ఉన్నందున పూర్తిస్థాయిలో సంసిద్ధత కష్టమేనని బోర్డుల ఛైర్మన్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ లోగా కేంద్రం ఏం చేయాలన్నదానిపై కూడా చర్చించినట్లు తెలిసింది. త్వరలోనే కేంద్రజల్‌శక్తి మంత్రి(Ministry of Jal Shakti) సమావేశం నిర్వహించి, గడువు పొడిగించాలా లేదా అన్నదానిపై చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం. గడువు పొడిగించాలన్నా, రెండో షెడ్యూలులో పేర్కొన్న ప్రాజెక్టులను మార్చాలన్నా మళ్లీ సవరణ ఇవ్వాల్సి ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details