17 నెలల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పాఠశాలలను శానిటైజేషన్ చేయించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. పురపాలక పాఠశాలల్లో కూడా వసతులు మెరుగుపరుస్తామని చెప్పారు. ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. పాఠశాలల్లో శానిటైజేషన్ పనులపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. విద్యాసంస్థల పునఃప్రారంభ సన్నద్ధతపై కలెక్టర్లు, అధికారులతో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆన్లైన్ తరగతులు ఉండవు
కరోనా నిబంధనలతో విద్యార్థులకు ప్రత్యక్షబోధన అందిస్తామని సబిత తెలిపారు. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కొవిడ్ సోకితే వెంటనే తల్లిదండ్రులకు అప్పగించాలని అధికారులకు సూచించారు. కొవిడ్ నిబంధనలతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వసతి కల్పిస్తామన్నారు. పాఠశాలల బస్సులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో భౌతికంగానే తరగతులు నిర్వహిస్తామని... ఆన్లైన్ తరగతులు ఉండవని స్పష్టం చేశారు.
సర్పంచ్ ఆధ్వర్యంలోనే విద్యాసంస్థల శానిటైజేషన్
పల్లె ప్రగతి, పట్టణ స్ఫూర్తితో పని చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. సర్పంచ్ ఆధ్వర్యంలోనే విద్యాసంస్థలను శానిటైజేషన్ ఉంటుందని అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. విద్యాసంస్థల నిర్వహణకు స్థానిక సంస్థల నిధులు వినియోగించుకునేలా ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులు విద్యాసంస్థలను పరిశీలించాలని సూచించారు. గ్రామ పంచాయతీ నిధులతోనే విద్యార్థులకు మాస్కులు అందిస్తామని తెలిపారు. విద్యార్థులంతా కొవిడ్ నిబంధనులు పాటించాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు.
రోజువారీ నివేదికలకు ఆదేశం
విద్యాసంస్థల పునఃప్రారంభంపై విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. సెప్టెంబరు 1 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో భౌతిక తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. కొవిడ్ నిబంధనలకు లోబడి విద్యాసంస్థలు నిర్వహించాలని స్పష్టం చేస్తూ.. విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఆదేశాలిచ్చారు. ఈనెల 30 నాటికి విద్యాసంస్థల పునఃప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. విద్యాశాఖ, వైద్యశాఖ, పంచాయతీరాజ్, పురపాలకశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పాఠశాలలను ప్రజాప్రతినిధులు తనిఖీ చేయాలని.. గ్రామ పంచాయతీలు పరిశుభ్రత చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతీ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి ఉన్నతాధికారులకు రోజువారీ నివేదికలు అందజేయాలన్నారు.
ఇదీ చదవండి :అంగన్వాడీ కేంద్రాలు సహా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల పునఃప్రారంభం