రాష్ట్రంలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో రైతులు, నిర్వాహకులు భౌతిక దూరం పాటించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లి హాకా భవన్‌లో ధాన్యం కొనుగోళ్లు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి సమీక్షించారు. పరిశుభ్రత, వసతుల కల్పనలో రాజీపడొద్దని... వరి కోతలను బట్టి దశల వారీగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 713 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా... వారం రోజుల్లో వరి కోతలు ఊపందుకుంటాయని పేర్కొన్నారు.
ఇబ్బందులు పడొద్దు
గ్రామీణ ప్రాంతాల్లో ధాన్యం విక్రయించే రైతులకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దని మంత్రులు సూచించారు. వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో పనిచేసి కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, కొనుగోలు కేంద్రాల సక్రమ పనితీరుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో నాణ్యమైన వరి పంట సాగు పెంచే చర్యలపై సమగ్ర అధ్యయనం చేయడానికి వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరముందని ఇటీవల ముఖ్యమంత్రి సమీక్షా సమావేశంలో మంత్రులు ప్రస్తావించిన దృష్ట్యా... ఈ విషయంలో రాష్ట్ర ప్రణాళిక వైస్ ఛైర్మన్ సలహా కమిటీ కోరాలని నిర్ణయించారు.