తెలంగాణ

telangana

ETV Bharat / city

'పేదలకు మెరుగైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యం' - డయాగ్నస్టిక్స్ కేంద్రాలు

చిన్న కడుపు నొప్పి మొదలు క్యాన్సర్ వరకు వ్యాధి ఏదైనా.... వైద్య పరీక్షలు తప్పని సరి అయ్యాయి. మందులకు అయ్యే ఖర్చు కంటే పరీక్షలకు అయ్యే మొత్తమే ఎక్కువ. పేద, మధ్యతరగతి వారికి ఈ వైద్య పరీక్షలను ఉచితంగా అందించే లక్ష్యంతో గతంలో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నస్టిక్స్ సేవలను సర్కారు మరింత విస్తరించింది. జీహెచ్​ఎంసీ వ్యాప్తంగా మరో 8 మినీ హబ్​లను నేటి నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆయా కేంద్రాల్లో రక్త పరీక్షలతోపాటు... ఎక్స్​రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ స్కాన్​లను ఉచితంగా అందించనుంది. ఫలితంగా వ్యాధులను త్వరగా గుర్తించి తగు చికిత్సలు అందించేందుకు మార్గం సుగమమం అవ్వటంతో పాటు... పేదలపై వైద్య భారం తగ్గనుంది. భవిష్యత్తులో జిల్లాలకు సైతం ఈ సేవలను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

ministers ktr and eetala rajender started diagnostic centers in hyderabad
ministers ktr and eetala rajender started diagnostic centers in hyderabad

By

Published : Jan 22, 2021, 4:11 PM IST

Updated : Jan 22, 2021, 8:06 PM IST

చిన్న పామైనా పెద్ద కర్రతో కట్టాలన్నది పెద్దలు చెప్పిన సామెత. చిన్న నొప్పైనా... స్కానింగ్, బ్లడ్ టెస్ట్ , ఎక్స్​రే ఇలా రకరకాల పరీక్షలు చేసి నిర్ధరించుకుంటే మంచిదన్నది నేటి వాదన. పంటి నొప్పి మొదలు గుండెపోటు వరకు వ్యాధి ఏదైనా... వైద్యం కంటే పరీక్షలకే లక్షలు ఖర్చవుతున్నాయి. ఫలితంగా పేదలకు వైద్య ఖర్చులు మోయలేని భారమవుతున్నాయి. ఈ విషయంపై ప్రత్యేకంగా సర్వే నిర్వహించిన తెలంగాణ సర్కారు... 2018లో నారాయణ గూడలోని ఐపీఎం ప్రాంగణంలో తెలంగాణ డయాగ్నస్టిక్ సెంట్రల్ హబ్​ని ఏర్పాటు చేసింది. ఇందులో నిత్యం 57 రకాల రక్త , మూత్ర పరీక్షలను నిర్వహిస్తున్నారు. మొత్తం 319 ఆస్పత్రుల నుంచి ఈ కేంద్రానికి నిత్యం శాంపిళ్లు వస్తుంటాయి. గత మూడేళ్లలో తెలంగాణ డయాగ్నస్టిక్ సెంట్రల్ హబ్ ద్వారా సుమారు పది లక్షల మందికి ప్రయోజనం చేకూరిందంటే వైద్య పరీక్షల ఆవశ్యకతను అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో డయాగ్నస్టిక్ సేవలను మరింత విస్తరించాలని భావించిన సర్కారు నేటి నుంచి జీహెచ్​ఎంసీ పరిధిలో మరో 8 మినీ హబ్​లను ప్రారంభించింది. ఆయా కేంద్రాల్లో రక్త, మూత్ర పరీక్షలతోపాటు.... రేడియాలజీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

నేటి నుంచి శ్రీరాంనగర్, లాలాపేట, అంబర్ పేట, బార్కాస్, జంగంపేట, పనీపురా, పురానాపూల్, సీతాఫల్ మండీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ తెలంగాణ డయాగ్నస్టిక్స్ మినీ హబ్​ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​... లాలాపేట కేంద్రాన్ని, శ్రీరాం నగర్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్.... పురాణాపూల్ప, నీపురా, బార్కాస్ కేంద్రాలను మంత్రి మహమూద్ అలీ, అంబర్​పేటలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీతాఫల్ మండిలో శాసనసభ ఉపసభాపతి పద్మారావు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ మినీ హబ్​లను ప్రారంభించారు.

ఆయా కేంద్రాల్లో ఈసీజీ, ఎక్స్​రే, ఆల్ట్రా సౌండ్ స్కాన్ కోసం అధునాతన పరికరాలను అందుబాటులోకి తీసుకురావటం విశేషం. జీహెచ్​ఎంసీ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు పొందుతున్న వారికి అవసరమైన రేడియాలజీ సేవల కోసం వైద్యులు ఆయా కేంద్రాలకు రోగులను పంపనున్నారు. అయితే గతంలో మాదిరి గంటల తరబడి ఫలితాల కోసం ఎదురుచూసే అవసరం లేకుండా టెలీ రేడియాలజీ విధానంలో నేరుగా రోగులకు సంబంధించిన రేడియాలజిస్టులకు ల్యాబ్ నుంచి ఫలితాలను పంపనున్నారు. ఈసీజీ సహా అన్ని పరీక్షల ఫలితాలను ఆన్ లైన్ ద్వారా అందించటం ఈ హబ్​ల ప్రత్యేకత. ముఖ్యంగా పేదింటి గర్భిణీ స్త్రీలకు ఈ మినీ హబ్​లు వరంగా మారనున్నాయి. ఆయా కేంద్రాల్లో ఆల్ట్రా సౌండ్ చేయించుకోవటం ద్వారా వైద్య ఖర్చులు తగ్గటంతోపాటు... తప్పనిసరి పరిస్థితిల్లో వేగంగా వైద్యం అందించేందుకు ఈ కేంద్రాలు మరింత ఉపయోగపడనున్నాయి.

జీహెచ్​ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ మినీ హబ్​లకు వచ్చే స్పందనను పరిశీలించిన అనంతరం... జిల్లాలకు సైతం ఆయా సేవలు విస్తరించనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. పేదలు పరీక్షల కోసం వేలకు వేలు నష్టపోవద్దని కోరిన ఆయన... భవిష్యత్తులో వైద్య ఆరోగ్యశాఖ ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని చేరువ చేసేందుకు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకువస్తుందన్నారు.

ఇదీ చూడండి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన నీతిఆయోగ్ బృందం

Last Updated : Jan 22, 2021, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details