తెలంగాణ

telangana

'జీపీఎస్​కు ఒప్పుకునే ప్రసక్తే లేదు.. తేల్చిచెప్పిన ఉద్యోగ సంఘాల నేతలు'

By

Published : Sep 7, 2022, 8:06 PM IST

Ministers committee discussions on CPS: ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ సీపీఎస్​ రద్దు చేయాల్సిందేనని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్​కు ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. ఇదిలావుంటే సీపీఎస్‌ రద్దు చేస్తామని ఏదో తొందరపాటులో హామీ ఇచ్చామని.. జీపీఎస్​లోనూ ఇంకా సదుపాయాలు పెంచుతామని మంత్రి బొత్స తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

సీపీఎస్‌
సీపీఎస్‌

Ministers committee discussions on CPS: ఆంధ్రప్రదేశ్​లో సీపీఎస్​పై ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి, ఆదిమూలపు సురేష్​లు.. సీపీఎస్​ కంటే మెరుగైన జీపీఎస్​ తెచ్చామని తెలిపారు. దీనికి ఎట్టి పరిస్థితుల్లోనైనా ఓపీఎస్​ అమలు చేయాలని.. జీపీఎస్​ ఒప్పుకునే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాలు నేతలు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి ఏపీజేఏసీ అమరావతి, ఏపీ సీపీఎస్ యూఎస్ సంఘాలు, ఏపీసీపీఎస్ ఈఏ సంఘాలు దూరంగా ఉన్నాయి.

సీపీఎస్​పై మంత్రి బొత్స:ఎన్నాళ్లుగానో ఉన్న ఈ సమస్యను ఉద్యోగులు.. అప్పుడెందుకు అడగలేదని మంత్రి బొత్స ప్రశ్నించారు. సీపీఎస్‌ రద్దు చేస్తామని ఏదో తొందరపాటులో హామీ ఇచ్చామని అన్నారు. సీపీఎస్ కంటే మెరుగైన జీపీఎస్ తెచ్చామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. జీపీఎస్‌లోనూ సదుపాయాలు ఇంకా పెంచుతామన్నారు. రిటైర్ అయ్యాక కనీసం రూ.10 వేలు పింఛన్​ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగి, భాగస్వామికి ప్రమాద బీమా, హెల్త్ కార్డులు ఇస్తామని తెలిపారు. ఉద్యోగి చనిపోయినా.. స్పౌజ్‌కు పింఛన్​ సదుపాయం ఇస్తామని తెలిపారు. అయితే జీపీఎస్‌ను అంగీకరించేది లేదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయని బొత్స అన్నారు.

ఉద్యోగ సంఘాలతో మరోసారి చర్చిస్తాం. సవరించిన జీపీఎస్‌పై సీఎంతో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తాం. జీపీఎస్‌కు చట్టబద్దత కల్పిస్తాం.. అసెంబ్లీలో చట్టం చేస్తాం.. సీపీఎస్ రద్దుపై మేం తొందరపడి హామీ ఇచ్చాం. మేనిఫెస్టోలో 95 శాతం హామీలు నెరవేర్చాం.. నెరవేర్చని 5శాతం హామీల్లో సీపీఎస్ రద్దు ఒకటి. కేసులు ఎత్తివేయాలని ఉద్యోగులు కోరినట్లు మంత్రి బొత్స తెలిపారు. తీవ్రమైన కేసులు గురించి సీఎం దృష్టికి తీసుకెళ్తాం. కేసుల ఎత్తివేతపై సానుకూల నిర్ణయం తీసుకుంటాం -బొత్స సత్యనారాయణ, మంత్రి

సీపీఎస్​పై ఉద్యోగ సంఘాలు: ఓపీఎస్‌ అమలు చేయలేమని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు ఉద్యోగ సంఘాల నేత సూర్యనారాయణ తెలిపారు. సీపీఎస్ బదులు జీపీఎస్ అమలు చేస్తామన్నారన్నారు. రిటైర్‌మెంట్‌ తర్వాత 33శాతం గ్యారంటీడ్‌ పింఛన్‌ ఇస్తామని మంత్రులు చెప్పారని.. ఉద్యోగికి ప్రమాద, హెల్త్ బీమా, స్పౌజ్ పింఛన్ ఇస్తామన్నారని పేర్కొన్నారు. ఉద్యోగికి రూ.10 వేల కనీస పింఛను ఇస్తామన్నారని చెప్పారు. జీపీఎస్‌ వల్ల నష్టమని ప్రభుత్వానికి నివేదించామన్నారు. జీపీఎస్ ఆమోదయోగ్యం కాదని గతంలోనే చెప్పామని స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దుపై మంత్రుల కమిటీ అధ్యయనం వివరాలు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.

సీఎం జగన్​ హామీ అమలుచేయాలి: ప్రజాస్వామ్యయుతంగా మా డిమాండ్లు తెలుపుతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. సీపీఎస్‌ రద్దు అనేది మా జీవన్మరణ సమస్య అని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ సీఎం అయితే తమ సమస్య పరిష్కారమవుతుందని ఆశించామన్నారు. చేయగలిగేవే చెప్తానని ఎన్నికలకు ముందు జగన్ అన్నారని గుర్తు చేశారు. జీపీఎస్‌ గురించి తప్ప.. ఇతర అంశంపై మాట్లాడేది లేదని మంత్రులు అన్నారని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌, ఝార్ఖండ్‌లో సీపీఎస్ రద్దు చేశారని ఉద్యోగులు తెలిపారు. ఇచ్చిన హామీని సీఎం జగన్‌ హామీ అమలు చేయాలని డిమాండ్​ చేశారు. వేల మంది ఉద్యోగులపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పింఛన్‌ విధానం పునరుద్ధరణ ఒక్కటే మా ఏకైక డిమాండ్‌గా పేర్కొన్నారు. పింఛన్‌ అనేది భిక్ష కాదు, ఉద్యోగుల హక్కు అని సుప్రీంకోర్టు చెప్పిందని స్పష్టం చేశారు.

సమావేశానికి ముందు సీపీఎస్​పై మంత్రి బొత్స వ్యాఖ్యలు:సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు సీఎం హామీ ఇచ్చారని మంత్రి బొత్స అన్నారు. అధికారంలోకి వచ్చాక పరిశీలిస్తే సీపీఎస్ రద్దు సాధ్యం కాదని తేలిందన్నారు. సీపీఎస్ రద్దుకు ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయని మంత్రి తెలిపారు. సీపీఎస్ కంటే మెరుగ్గా ప్రభుత్వం జీపీఎస్ తీసుకువచ్చిందని స్పష్టం చేశారు.

ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ ఉందని... భేటీలో జీపీఎస్ అమలుపై మరిన్ని అంశాలు చర్చిస్తామని మంత్రి బొత్స తెలిపారు. ఇప్పటివరకు జరిగిన భేటీలన్నీ అనధికారికమేనని పేర్కొన్నారు. ఇవాళ ఉద్యోగ సంఘాలతో జరిగే సమావేశమే అధికారికమైందని స్పష్టం చేశారు. భేటీకి రావాలని అన్ని ఉద్యోగ సంఘాలను ఆహ్వానించామన్నారు. భేటీకి అన్ని ఉద్యోగ సంఘాల నేతలు వస్తారని ఆశిస్తున్నాం.. భేటీకి రాకపోతే సీపీఎస్ బాగుందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నట్లు అనుకుంటామన్నారు. భేటీని ఉద్యోగ సంఘాలు బహిష్కరిస్తే ప్రభుత్వ నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొన్నారు.

'జీపీఎస్​కు​ ఒప్పుకునేది లేదన్న ఉద్యోగ సంఘాల నేతలు'

ఇవీ చదవండి:యువకుడిని చెట్టుకు కట్టి కొట్టిన గ్రామస్థులు.. ఆ పని చేశాడని..

టీవీ ఆపిందని అత్త చేతివేళ్లను విరిచేసిన కోడలు.. మధ్యలో వచ్చిన భర్తను సైతం..

ABOUT THE AUTHOR

...view details