Paddy Procurement Issue : యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ.. ఉగాది తర్వాత ఉద్ధృతమైన ఆందోళనలు చేస్తామని మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. వడ్లు కొనాల్సిన బాధ్యతల నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూడటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్ నూకలు తినాలన్న వ్యాఖ్యలపై అమాత్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర మంత్రులను అవహేళన చేస్తూ మాట్లాడారని మండిపడ్డారు. రాష్ట్ర మంత్రులను పనివాళ్లుగా చూసే ధోరణి దుర్మార్గమన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. తెలంగాణ ప్రజలకు కేంద్రం క్షమాపణలు కోరే పరిస్థితిని తీసుకొస్తామని ఉద్ఘాటించారు. బియ్యం ఎగుమతులను పెంచుకునే ప్రయత్నాలను కేంద్రం చేయట్లేదని ఆక్షేపించిన మంత్రులు.. రాష్ట్రానికి చెందిన కిషన్‌రెడ్డి కనీసం కేంద్రంపై ఒత్తిడి ఎందుకు తేవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల పక్షాన పోరాడతామని అమాత్యులు స్పష్టం చేశారు.
Paddy Procurement Issue in Telangana : "మార్పులు సూచిస్తే స్వీకరించే ఔదార్యం కూడా కేంద్ర మంత్రులకు లేదు. కేంద్రమంత్రుల అవగాహన రాహిత్యాన్ని ప్రజలు సహించరు. వరి సాగు చేయండని.. రైతులను రెచ్చగొట్టిన భాజపా నేతలు ఇప్పుడెందుకు కేంద్రాన్ని అడగట్లేదు. తెలంగాణలో యాసంగి వడ్లు మిల్లింగ్ చేస్తే నూకలు ఎక్కువగా వస్తాయి. బాయిల్డ్ రైసు కొనకపోతే ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలి. ధాన్యం కొని కేంద్రమే మిల్లింగ్ చేసుకోవాలి. రైతుల సమస్యను పరిష్కరించలేని కేంద్ర ప్రభుత్వం ఎందుకు?. తెలంగాణ రైతుల కోసమైనా కేంద్రాన్ని కిషన్‌రెడ్డి అడగవచ్చు కదా!. యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాలను పట్టించుకోవట్లేదని ఇదే భాజపా నేతలు అనలేదా? యూపీఏను విమర్శించిన భాజపా నేతలు ఇవాళ అదే ధోరణిలో వెళ్తున్నారు. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతానికి తీసుకెళ్లాలనే లక్ష్యాన్ని విమర్శించారు. ఇథనాల్ తయారీకి అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించట్లేదు. బియ్యం ఎగుమతులను పెంచుకునే ప్రయత్నాలను కూడా కేంద్రం చేయట్లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో బియ్యం కొరతను తీర్చే సదుద్దేశం కూడా కేంద్రానికి లేదు."