VISWAROOP: కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతమైన లంకల గన్నవరం గ్రామాన్ని సందర్శించిన ఏపీ మంత్రి విశ్వరూప్‌పై వరద బాధితులు మండిపడ్డారు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఉన్న శ్రద్ధ ఇలాంటి సమయంలో కనపడదా అని నిలదీశారు. మూడు రోజులుగా వరద నీటిలో నానుతున్నా కనీసం మంచినీళ్లు కూడా పంపిణీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు, వృద్ధులు తిండి లేక అల్లాడుతున్నారని వాపోయారు. తక్షణమే ఈ గ్రామానికి 6 వేల ఆహార పొట్లాలు అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మంత్రి విశ్వరూప్, స్థానిక ఎమ్మెల్యే చిట్టిబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
Flood effect: మహోగ్ర గోదావరి.. మూడు దశాబ్ధాల తర్వాత లంక గ్రామాల ప్రజల్ని బిక్కుబిక్కుమనేలా చేస్తోంది. ప్రతి ఏడాది వరదలానే భావించి అక్కడే ఉండిపోయిన లంకవాసులు ప్రస్తుత గోదావరి ఉద్ధృతికి తేరుకుని బయటికి రాలేక.. సర్వం కోల్పోయారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేనికోన, ఐ. పోలవరం, తాళ్లరేవు మండలాల్లోని లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఇంటిలోని వస్తువులను వరద నీటి నుంచి కాపాడుకునేందుకు నానాఅవస్థలు పడుతున్నారు. పాడి పశువుల్ని ప్రాణాలతో దక్కించుకునేందుకు తీవ్ర కష్టాలు పడుతున్నారు. గూడుచెదిన వారంతా గుడారాల్లోనూ.. కింది అంతస్తు మునిగిన వారంతా.. డాబాల మీదకు చేరి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.