కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం హాట్స్పాట్లను వదిలేసి.. వలస కూలీల క్యాంపులు ఉన్న చోట పనులు ప్రారంభించాలని రోడ్లు భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖల పనుల పురోగతిపై మంత్రి వేర్వేరుగా సమీక్షా సమావేశం నిర్వహించారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ శాఖల్లో కార్మికుల కోసం తీసుకుంటున్న చర్యలను ఈ సమావేశంలో చర్చించారు. కరోనాపై వలస కూలీలకు అవగాహన కల్పిస్తూ మాస్క్‌లు, శానిటైజర్లు, భోజన వసతి ఏర్పాటు చేయాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. కూలీలంతా సమూహంగా పనిచేయకుండా భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు.
ప్రతి జిల్లాలో క్వాలిటీ కంట్రోల్ అధికారులతో ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని ఏర్పాటుచేసి క్షేత్రస్థాయిలో కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.