గృహనిర్మాణ సంస్థ ఆస్తులపై వారం రోజుల్లోపు సవివర నివేదిక సమర్పించాలని అధికారులను గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. హౌసింగ్ బోర్డు ఆస్తులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. భూములు, ప్లాట్లు, భవనాలు, కార్యాలయాల స్థలాలు, వాణిజ్య స్థలాలు తదితర కాలనీల వారిగా విభజించి వివరాలు అందించాలని స్పష్టం చేశారు.
ప్రణాళికలు సిద్ధం చేయండి
స్థలాలను అనుభవిస్తున్నవారు, విస్తీర్ణం, వాటి విలువ, వాటి ప్రస్తుత పరిస్థితిపై పూర్తి జాబితా - ఇన్వెంటరీ తయారు చేయాలని మంత్రి పేర్కొన్నారు. ఆస్తుల్లో నిరర్ధకమైనవి, ఉపయోగిస్తున్న వాటి వివరాలు కూడా సమగ్రంగా అందించాలని సూచించారు. ఆస్తులపై కోర్టు కేసులు ఉంటే త్వరితగతిన తేల్చేలా హౌసింగ్ బోర్డ్ ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రశాంత్ రెడ్డి చెప్పారు.