సమాజంలో ఆడబిడ్డలపై దాడులు జరగకుండా చూసుకోవడంలో తల్లిదండ్రుల పాత్ర ఉండాలని.. మరీ ముఖ్యంగా తల్లి పాత్ర కీలకమని హోం మంత్రి వనిత వ్యాఖ్యానించారు. తల్లి ఆడబిడ్డలకు రక్షణగా ఉండి సంరక్షణ ఇవ్వాలని.. ఎలాంటి అఘాయిత్యాలూ జరగకుండా చూసుకోవాలని అన్నారు. తల్లి పాత్ర సరిగ్గా పోషించకుండా పోలీసులదే బాధ్యతంటూ తోసివేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఏపీ విశాఖలో దిశ పోలీస్ స్టేషన్ను పరిశీలించిన ఆమె.. గ్రామీణ ప్రాంతాల్లోనూ మహిళ పోలీసు వ్యవస్థను తీసుకొచ్చి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తున్నామన్నారు.
"ఈ తప్పు ఎందుకు జరిగిందని ఆలోచన చేస్తే చాలా కారణాలున్నాయి. అసలు తప్పు చేసే వ్యక్తి మానసిక పరిస్థితి ఎలా ఉంది. తల్లిదండ్రులు పిల్లలతో ఏవిధంగా ఉంటున్నారు. అలాంటప్పుడు నేను తల్లిగా చెబుతున్నాను. ఆడబిడ్డల సంరక్షణ తండ్రి కంటే తల్లిదే ఎక్కువ బాధ్యత. కనుక మనం వాళ్లను కాపాడుకోవాలి. తల్లి బిడ్డను కంటిరెప్పలా కాపాడుకోవాలి. అప్పుడే ఈ అఘ్యాత్యాలను నివారించగలం. తల్లి పాత్ర సరిగ్గా పోషించకుండా పోలీసులదే బాధ్యతంటూ తోసివేయడం సరికాదు."
- తానేటి వనిత హోం మంత్రి