ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి బారి నుంచి అన్ని వర్గాల ప్రజలను కాపాడేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ని తెలంగాణా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు
కరోనా బారి నుంచి ప్రజలను కాపాడటానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్ పేటలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాలను మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ లోకేశ్ కుమార్, స్థానిక కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు.
కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టిందని మంత్రి అన్నారు. వ్యాక్సిన్ పంపిణీ, కరోనా బాధితులకు చికిత్స అందించడం, మందుల సరఫరా తదితర విషయాలలో ప్రభుత్వం ఎంతో పకడ్బందీగా వ్యవహరిస్తుందని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో సర్కిల్‌కు ఒకటి చొప్పున 30 కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. ఒక్కో కేంద్రంలో రోజుకు వెయ్యి మంది చొప్పున 10 రోజుల పాటు వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని వివరించారు. ఈ పది రోజులు సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ అందజేయనున్నట్లు చెప్పారు.
లాక్డౌన్ వల్ల ఎవరు ఆకలితో అలమటించవద్దనే ఉద్దేశంతో ప్రతిరోజూ 60 వేల మందికి అన్నపూర్ణ భోజన కేంద్రాల ద్వారా ఉచితంగా భోజన సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజూ శానిటైజేషన్, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ జరుపుతున్నట్లు వివరించారు.