రాష్ట్రంలో జీవాలకు మెరుగైన వైద్య సేవలందించాలనేది ప్రభుత్వం లక్ష్యమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో పశుసంవర్ధక శాఖకు గతంలో లేని విధంగా పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని తెలిపారు. అనేక కార్యక్రమాల నిర్వహణ ఫలితంగా ఎంతో గుర్తింపు లభించిందని తెలిపారు. జీవాలకు వైద్య సేవలు అందించడంలో భాగంగా కాంట్రాక్ట్ పద్ధతిన గతంలో నియమించిన 75 మంది వైద్యుల పదవీకాలం మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
పశుసంవర్ధక శాఖలో కాంట్రాక్ట్ వైద్యుల సేవలు అవసరమని భావించి... 2022 మార్చి 31 వారు విధుల్లో పాల్గొనేలా ఉత్తర్వులను జారీ చేసినట్లు చెప్పారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం సైతం అనేక సందర్భాల్లో ప్రశంసించిందని మంత్రి గుర్తు చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు మూగజీవాల వద్దకే వైద్య సేవలను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో... నియోజకవర్గానికి ఒకటి చొప్పున 100 సంచార పశు వైద్యశాలలు ప్రారంభించడం జరిగిందని అన్నారు.