Bansilalpet Step Well: రాష్ట్రంలో చారిత్రక కట్టడాల సంరక్షణ లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం ముందుకు వెళ్తోంది. హైదరాబాద్‌లో ఇప్పటికే ఎంజే, మెుండా మార్కెట్, బాపూఘాట్ ప్రాచీన బావి సహా మీరాలం మండిని పునరుద్ధరించారు. జీహెచ్ఎంసీతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారంతో చర్యలు చేపట్టారు. ప్రస్తుతం బన్సీలాల్‌పేటలోని పురాతన కట్టడమైన మెట్లబావిని పునరుద్ధరిస్తున్నారు. ఈ మెట్ల బావిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. మంత్రితో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సందర్శించారు. ఆగస్టు 15 లోగా మెట్లబావిని తిరిగి ప్రారంభిస్తామని తలసాని తెలిపారు.
మెట్లబావికి పూర్వవైభవం..
Talasani About Bansilalpet Step Well : రాష్ట్రంలో చారిత్రక కట్టడాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో.. చెత్త చెదారంతో నిండిపోయిన మెట్లబావిని పునరుద్ధరించే చర్యలు చేపట్టారు. 6 నెలల నుంచి.. బావిలో పేరుకుపోయిన పూడిక తొలగింపు పనులు చేపడుతున్నారు. బావిని పునరుద్దరించి పూర్వ వైభవం తీసుకువస్తామని మంత్రి తలసాని స్పష్టం చేశారు.
మాకు డబ్బు ముఖ్యం కాదు..
Bansilalpet Step Well in Hyderabad : '800 లారీల శిథిలాలను ఇక్కడి నుంచి తొలగించాం. ఆ ప్రక్రియ పూర్తయ్యాక బావిలో ఉన్న నీళ్లు చూసి ఆశ్చర్యపోయాం. చాలా స్వచ్ఛంగా ఉన్నాయి మెట్లబావిలోని నీళ్లు. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ బావిని పునఃప్రారంభించాలని నిర్ణయించాం. ఎంత ఖర్చయినా.. మనకున్న చారిత్రక సంపదను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఆయన నిర్ణయం మేరకు రాష్ట్రంలోని పురాతన కట్టడాల పునరుద్ధరణకు పూనుకున్నాం. త్వరలోనే ఈ మెట్లబావి పునఃప్రారంభం జరిగి నగర పర్యాటకులే కాదు రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. ఇది ఒక మంచి పర్యాటక ప్రాంతం అవుతుంది.'
- తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర మంత్రి
Municipal Secretary Aravind : హైదరాబాద్‌లో దాదాపు 60 నుంచి 80 వరకు పురాతన బావులు ఉన్నాయని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటిని పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందరి సహకారంతో మెట్ల బావికి మళ్లీ పూర్వవైభవం తీసుకువస్తామని చెప్పారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!