హైదరాబాద్ శివారులో నిర్మించే ఇళ్లల్లో 10 శాతం స్థానికులకు, 90 శాతం నగరవాసులకు ఇస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ నాయకులెవరూ జోక్యం చేసుకోవడం లేదని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణాలను కూడా ఎన్నికల కోసమే అని విపక్షాలు అనటం దారుణమని మండిపడ్డారు. ఇళ్లను పరిశీలించడానికి ఇంజినీర్ల బృందం కావాలని కాంగ్రెస్ నేతలు వెళ్లిపోయారని చెప్పారు.
హైదరాబాద్లో వందల ఎకరాలు ఎక్కడ ఉన్నాయో కాంగ్రెస్ నేతలు చూపించాలని తలసాని సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను తీసుకోవడానికి లబ్ధిదారులు కూడా రావటం లేదని ఎద్దేవా చేశారు. పేదలకు ఇంత గొప్ప ఇళ్లు నిర్మించిన ప్రభుత్వాలు ఉన్నాయా అని అన్నారు. లక్ష ఇళ్లను కాంగ్రెస్ నేతలు ఎప్పుడైనా చూసుకోవచ్చని తెలిపారు. నిజాయతీగా చూపించినప్పుడు, అంతే నిజాయతీగా ఒప్పుకోవాలని... నిజాన్ని ఒప్పుకోలేక పారిపోయారని విమర్శించారు.