Minister Talasani Review on Ramadan: ముస్లింలు పవిత్రంగా నిర్వహించుకునే రంజాన్ పండుగకు సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాసబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్, హార్టికల్చర్, తదితర శాఖల అధికారులు, సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని మసీదు కమిటీ సభ్యులతో రంజాన్ ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
4, 5 రోజులు మాత్రమే ఉన్నందున...
కరోనా మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాల నుంచి ముస్లిం సోదరులు రంజాన్‌ను నిర్వహించుకోలేకపోయారని తెలిపారు. ఈ ఏడాది రంజాన్ రోజాలు ఏప్రిల్ 2 లేదా 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని... కేవలం 4, 5 రోజుల వ్యవధి మాత్రమే ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. నెల రోజుల పాటు జరిగే రోజాల సందర్భంగా వారు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మసీదు కమిటీ సభ్యుల నుంచి వచ్చే ఫిర్యాదులపై సకాలంలో స్పందించి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు.