పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చివేస్తే ప్రభుత్వం ఊరుకుంటుందా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. నాలుగు ఓట్ల కోసం భాజపా నాటకాలాడుతోందని మండిపడ్డారు.
'పీవీ, ఎన్టీఆర్ ఘాట్లు కూల్చివేస్తే ప్రభుత్వం ఊరుకుంటుందా?'
జీహెచ్ఎంసీ పరిధిలో లేని అంశాలను భాజపా మేనిఫెస్టోలో పెట్టారని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఉంటే రూ.25వేల వరదసాయం ఎలా ఇస్తారని, ప్రధానితో జీవో ఇప్పిస్తారా అని ప్రశ్నించారు.
కొవిడ్ వ్యాక్సిన్ నగరంలో తయారుకావడం గర్వకారణమని మంత్రి తలసాని అన్నారు. ఎన్డీఏ సర్కార్.. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని ప్రకటిస్తోందని చెప్పారు. జీహెచ్ఎంసీలో ఎప్పుడైనా భాజపా అధికారంలో ఉందా అని ప్రశ్నించారు. పరిపాలన అనుభవం లేని వారు మేనిఫెస్టో విడుదల చేశారని ఎద్దేవా చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా శనివారం రోజున ఎల్బీ స్టేడియంలో జరగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలంతా సాయంత్రం 4 గంటలకే హాజరవ్వాలని కోరారు. నాయకులు, కార్యకర్తలంతా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.