ఎండాకాలంలో ఏ ఒక్క గిరిజన ఆవాసం కూడా తాగునీటి కోసం ఇబ్బంది పడవద్దని.. అందుకు కావల్సిన అన్ని వసతులు వెంటనే కల్పించాలని మంత్రి సత్యవతి రాఠోడ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎండాకాలంలో మారుమూల, సుదూర ప్రాంతాల్లోని గిరిజన ఆవాసాల్లో తాగునీటి వసతులపై హైదరాబాద్లోని సంక్షేమ భవన్ నుంచి గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తు, ఉన్నతాధికారులతో కలిసి ఐటీడీఏల ప్రాజెక్టు అధికారులు, మిషన్ భగీరథ అధికారులతో వెబినార్ నిర్వహించారు. తెలంగాణ రాకముందు గ్రామాలకు తాగునీటి కొరత ఉండేదని.. గిరిజన గ్రామాల గోస చెప్పేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ మిషన్ భగీరథ తెచ్చాక దాని ద్వారా 99 శాతం గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. ఆగిపోయిన ఆ ఒక్క శాతం సుదూర ప్రాంతాల్లోని గిరిజన ఆవాసాలే అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మిషన్ భగీరథ ఇబ్బందులున్నవి 105 ఆవాసాలు మాత్రమే అని... వీటిల్లో కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఉండడం వల్ల అక్కడ కరెంటు లేక తాగునీటి సమస్య ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రతి గిరిజన ఆవాసానికి 3 ఫేజ్ కరెంటు ఇవ్వాలని నిర్ణయించారని.. కరెంటు లేనిచోట సోలార్ ద్వారా విద్యుత్ అందించాలన్నారు. తాగునీటి వసతి లేని గిరిజన ఆవాసాలు ఉండకూడదని... ముఖ్యంగా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు మరింత అప్రమత్తంగా పనిచేయాలన్నారు. మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకుని స్థానికంగా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించాలన్నారు. లేనిపక్షంలో ప్రభుత్వం దృష్టికి వెంటనే తీసుకొచ్చి పరిష్కరించాలని సూచించారు.