రాష్ట్రంలో రైతాంగానికి నాణ్యమైన నూతన వేరుశనగ వంగడాలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇక్రిశాట్ అభివృద్ది చేసిన నూతన వేరుశనగ వంగడాలపై సమీక్షించిన మంత్రి... ఇక్రిశాట్, భారత జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి సహకారంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నూతన వంగడాల ఉత్పత్తి చేసినట్టు తెలిపారు. 80 శాతం ఓలిక్ యాసిడ్ ఉండే గిరినార్ 4, గిరినార్ 5 వంగడాలు రాబోయే యాసంగి సీజన్లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు.
ఆలివ్ ఆయిల్లో ఉండే నాణ్యత కలిగిన ఈ నూతన వంగడాలతో... 115 రోజుల్లో పంట చేతికి వస్తుందని మంత్రి తెలిపారు. వినియోగదారులకు ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగమైందన్నారు. బహిరంగ మార్కెట్‌లో రైతులకు అధిక ధర కూడా లభిస్తుందన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, అర్జెంటినా, చైనా వేరుశనగ ఉత్పత్తులతో పోటీ పడే స్థాయి ఈ వంగడాలకుందని కితాబిచ్చారు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో యాసంగి సాగుకు అనుకూలమైన వంగడాలు అని మంత్రి చెప్పారు. పంట కోత సమయంలో తేమ లేమి కారణంగా ఆఫ్లాటాక్సిన్ లేని అంతర్జాతీయ నాణ్యత కలిగిన వేరుశనగ ఉత్పత్తి వస్తుందని పేర్కొన్నారు.