Niranjanreddy comments on Rahul Gandhi : కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయని రైతు డిక్లరేషన్‌ను తెలంగాణలో అమలు చేస్తారా..? అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రాహుల్ గాంధీని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ తెరాసపై చేసిన ఆరోపణలను నిరంజన్ రెడ్డి తిప్పికొట్టారు. తెలంగాణ ఎవరి బిక్షమో కాదని.. పోరాడి సాధించుకున్నామని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు, రైతు బీమా ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ 28 రాష్ట్రాల నుంచి మూడు రాష్ట్రాలకు కుచించుకుపోయిందని.. మంత్రి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ 2లక్షల రుణమాఫీని 2018లోనే తెలంగాణ ప్రజలు తిరస్కరించారని... తెరాస ఇచ్చిన లక్ష రుణమాపీని ఆమోదించారని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో రుణమాఫీ పాక్షికంగా జరిగిందని.. ఇప్పుడు తప్పకుండా ఆ ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. పంజాబ్‌లో కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయకపోవడం వల్లే చిత్తుగా ఓడించారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ చెప్పే మోసపూరిత మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి విమర్శించారు. 2018 ఎన్నికల్లో 2 లక్షల రూపాయల రుణమాఫీ హామీ ఇచ్చినా ప్రజలు తిరస్కరించారని.. మళ్లీ ఇప్పుడు కూడా అదే పాత పాట పాడుతున్నారని ఎద్దేవా చేశారు. పెట్టుబడి సాయం 15 వేల రూపాయలు అందిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని.. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అది వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బీమా పథకాన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేసి చూపించాలని సవాలు విసిరారు.