Bandi Sanjay vs Niranjan Reddy: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనంతా 'రైతుల కంట కన్నీరు- కేసీఆర్ ఫామ్‌హౌస్ పంట పన్నీరు'గా మారిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్‌ను ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రిగా పేర్కొంటూ ముఖ్యమంత్రికి బండి సంజయ్ మూడు పేజీల బహింరంగ లేఖ రాశారు. కేంద్రం, ప్రధాని మోదీపై ఆరోపణలు ఆపాలని లేఖలో పేర్కొన్నారు. వరి సహా 14 పంటలకు కనీస మద్దతు ధరను పెంచినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. రైతుబంధు నిధులు రూ. 7,500 కోట్లను రైతుల ఖాతాలో వెంటనే జమ చేయాలని.. రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని లేఖలో బండి సంజయ్ డిమాండ్ చేశారు.
'ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రచారానికి, మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనకు కోట్ల నిధులు వెచ్చిస్తున్న ప్రభుత్వం రైతుబంధుకు.. రైతు రుణమాఫీకి సకాలంలో నిధులు కేటాయించకపోవడం బాధాకరం. రైతుబంధు నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో అధిక వడ్డీలకు రైతులు రుణాలు తీసుకుంటూ అప్పుల పాలవతున్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం ఇప్పటి వరకు తెలంగాణలో రూ. 5,800 కోట్ల నిధులను జమచేసి రైతులను ఆదుకుంది. ఈ సీజన్ కోసం రూ.580 కోట్ల నిధులను విడుదల చేసింది.' అని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.
నిరంజన్ రెడ్డి ఫైర్:బండి సంజయ్ లేఖపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. బండి సంజయ్‌పై విమర్శలు గుప్పించారు. బండి సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖ... నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అన్న చందంగా ఉందని ఆక్షేపించారు. రైతుబంధుకు పీఎం కిసాన్ నిధికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని పేర్కొన్నారు. 'యాసంగి వడ్లు కొనిపించే బాధ్యత నాది... రైతులు వరి వేయాలి' అన్న బండి సంజయ్.. ఆ తరువాత మొహం చాటేశారని మంత్రి మండిపడ్డారు. ముఖ్యమంత్రి పెద్ద మనసుతో యాసంగి వడ్లను కొనుగోలు చేశారని... రైతులను రెచ్చగొట్టి పక్కకు తప్పుకున్న సంజయ్ వారికి క్షమాపణ చెప్పి పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ముక్కు నేలకు రాయాలన్నారు. రైతుబంధు, రైతుబీమాపై మాట్లాడే అర్హత భాజపాకు లేదన్నారు. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించిన 14 పంటల్లో పొద్దుతిరుగుడు మినహా మరే పంట సాగు చేసినా గిట్టుబాటు కాదని ఎద్దేవా చేశారు.