పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మళ్లీ పాత అబద్ధాలే చెప్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. సభ సాక్షిగా కొందరు ముఖ్యమంత్రులు బెదిరించారని చెప్పడం అప్రజాస్వామికమని అన్నారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వాన్ని తప్పుపట్టారని గుర్తుచేశారు. మరి నాడు మోదీ చేసింది బెదిరింపేనా అని ప్రశ్నించారు.
కేంద్రం కొనుగోళ్ల బాధ్యత వదిలేసి రాష్ట్రాలు కొనుగోలు చేసుకోవచ్చంటూ చేతులెత్తేయడం రాజ్యాంగ విరుద్ధమని నిరంజన్ రెడ్డి అన్నారు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్న పీయూష్ గోయల్‌కు పదవిలో ఉండే అర్హత ఉందా అని ప్రశ్నించారు. రైతులకు వెంటనే సమాధానం చెప్పాలని నిలదీశారు. కేంద్రం రాసుకున్న ఫార్మాట్లో రాష్ట్రాల నుంచి బలవంతంగా లేఖలు తీసుకుని... బాయిల్డ్ రైస్ ఇవ్వమని లేఖ ఇచ్చారనడం దుర్మార్గమని మండిపడ్డారు.
'తెలంగాణలో యాసంగిలో బాయిల్డ్ రైస్‌కు అనుకూలంగా ఉన్న ధాన్యం మాత్రమే పండుతాయి. ఇది కేవలం ఒక తెలంగాణ ప్రాంతానికి మాత్రమే ఉన్న ప్రత్యేక పరిస్థితి. రా రైస్ చేస్తే వచ్చే నష్టాన్ని కేంద్రం ఎందుకు భరించదు. ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడదు? పార్లమెంటు సాక్షిగా దీనికి ఎందుకు సమాధానం చెప్పలేదు? నేరుగా కేంద్రం ధాన్యం కొనుగోలు చేసి దానిని రా రైస్‌గా చేసుకుంటారో ? బాయిల్ చేసుకుంటారో ? వారి ఇష్టం.'- నిరంజన్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి