తెలంగాణ

telangana

ETV Bharat / city

'విజయ్​ సంకల్ప్​ సభ అందుకేనా?'.. మోదీకి మంత్రి నిరంజన్​రెడ్డి ప్రశ్నాస్త్రాలు.. - రైతుబంధు పథకం

Minister Niranjan Reddy Comments: రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయాన్ని మూడో రోజు అన్నదాతల ఖాతాల్లో సర్కారు జమ చేసింది. మూడు రోజుల్లో మొత్తం.. 47 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించినట్టు మంత్రి నిరంజన్​రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా.. ప్రధాని మోదీకి మంత్రి పలు ప్రశ్నలు సంధించారు.

Minister Niranjan Reddy Questions to prime minister modi on vijay sankalp sabha
Minister Niranjan Reddy Questions to prime minister modi on vijay sankalp sabha

By

Published : Jun 30, 2022, 4:27 PM IST

Minister Niranjan Reddy Comments: రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద మూడో రోజు 1312.46 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయాన్ని అన్నదాతల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. 10 లక్షల 78 వేల 634 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేసింది. ఈ మూడు రోజుల్లో 47 లక్షల 9 వేల 219 మంది రైతుల ఖాతాల్లో 3133.21 కోట్ల రూపాయలు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. రైతుబంధు నిధులు అన్నదాతల ఖాతాల్లో జమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి... వివిధ రంగాల్లో కేంద్రం వైఫల్యాలు, రాష్ట్రం పట్ల వివక్షను ఖండించారు.

దేశంలో రైతుల కష్టాలు తెలిసిన ఏకైక సీఎం కేసీఆర్ అని.. వ్యవసాయ రంగానికి అత్యధిక బడ్జెట్ కేటాయిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని మంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అత్యధిక శాతం మంది ఉపాధి పొందుతున్న దృష్ట్యా చేయూత ఇవ్వాలన్న ముందు చూపు.. కేంద్రంలో ఉన్న భాజపా పాలకులకు కొరవడిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తెగనమ్ముతూ ఆఖరుకు ఆహార రంగాన్ని కూడా కార్పొరేట్ల పరంచేసే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రైతుల పట్ల రాష్ట్ర భాజపా నేతలది మొసలికన్నీరని ధ్వజమెత్తారు. పీఎంకేఎస్‌వై రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ ఎందుకు రాదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు విషయంలో నిబంధనలు మార్చి కేంద్రం రైతుల గొంతు కోయాలని చూస్తున్న మోదీ పాలనలో దేశం అన్ని రంగాలలో దివాలా తీసిందని ఆందోళన వ్యక్తం చేశారు. భాజపా కార్యవర్గ సమావేశాలకు వస్తున్న ప్రధాని మోదీ... రాష్ట్ర ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని మంత్రి డిమాండ్​ చేశారు. హైదరాబాద్​లో విజయ్​ సంకల్ప్​ సభ ఎందుకు నిర్వహిస్తున్నారంటూ.. ప్రశ్నస్త్రాలు ఎక్కుపెట్టారు.

"తెలంగాణకు 8 ఏళ్లలో కేంద్రం ఏమిచ్చింది...? ఏ రంగంలో విజయం సాధించారని విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారు...? జీఎస్టీతో చిన్న వ్యాపారుల పొట్టకొట్టి రాష్ట్రాల ఆదాయం ఎత్తుకెళ్లేందుకా...? వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రైతుల నడ్డి విరిచినందుకా...? 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని రైతుల పెట్టుబడి ఖర్చులు రెట్టింపు చేసినందుకా...? ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానని పేదలను మోసం చేసినందుకా...? నల్లధనం తెస్తానని దేశ ప్రజలను మోసం చేసినందుకా...? నోట్ల రద్దుతో సామాన్యుల నడ్డి విరిచినందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా...? కరోనా కష్టకాలంలో వలస కూలీలు, పేదలు, వారి ప్రాణాలను గాలికి వదిలేసి చప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి అన్నందుకా...? ఆఖరుకు ఆక్సిజన్ అందుబాటులో లేకుండా చేసి పేదల ప్రాణాలు పణంగా పెట్టినందుకా...? దేశంలో పేదల రుణాలపై వడ్డీ భారం మోపుతూ కార్పొరేట్ల రుణాలు 11 లక్షల కోట్లు మాఫీ చేసినందుకా..? నల్ల చట్టాలు తెచ్చి రైతులను రోడ్ల మీదకు తెచ్చి 700 మంది ప్రాణాలను బలిగొన్నందుకా...? ఉపాధి హామీకి వ్యవసాయం అనుసంధానం చేస్తానని హామీ ఇచ్చి మోసం చేసినందుకా...? స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తామని చెప్పి మోసం చేసినందుకా..? ఎరువుల ధరలు పెంచి రాయితీలు ఎత్తేసి రైతుల నెత్తిన భారం మోపుతున్నందుకా...? పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తానని చెప్పి వాటి ధరలను ఎనిమిదేళ్లలో రెట్టింపు చేసినందుకా...? 67 ఏళ్లల్లో 54 లక్షల కోట్లు అప్పు చేస్తే 8 ఏళ్లల్లో 100 లక్షల కోట్లు అప్పు చేసి 154 లక్షల కోట్ల రూపాయలు అప్పు దేశం నెత్తిన పెట్టినందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా...?" - నిరంజన్​రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details