జాతి సంపద పెంచే తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేయూత ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులతో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, కిసాన్ క్రెడిట్ కార్డుల ప్రగతి, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుపై విస్తృతంగా చర్చించారు. తెరాస ప్రభుత్వ ఊతంతో తెలంగాణ వ్యవసాయ స్వరూపం మారిపోయిందని కేంద్ర మంత్రికి నిరంజన్ రెడ్డి వివరించారు.
501 సంఘాలున్నాయి
రాష్ట్రంలోని ఆసిఫాబాద్, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఆ మూడు జిల్లాలు ఉత్తర తెలంగాణ పరిధిలో ఉన్నందున వేరుశనగ, వరి, మామిడి వంటి పంటలకు అనువుగా ఉన్నాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దక్షిణ తెలంగాణలో వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలను కూడా అదనంగా చేర్చాలని మంత్రి విన్నవించారు. రాష్ట్రంలో అన్ని మండలాల్లో ఒకటి లేదా రెండు ఎఫ్ఏఓల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోందన్నారు. ఇప్పటికే సమర్థవంతంగా 501 సంఘాలు నడుస్తున్నాయని చెప్పారు.
89 శాతం మందికి రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తున్నాం. పంట రుణాలు తీసుకున్న 41.61 లక్షల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేశాం. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద లబ్ధిపొందుతున్న 36.79 లక్షల మంది రైతుల కన్నా ఇది అధికం. రైతుబంధు పథకం కింద పంటకు పెట్టుబడి ఇచ్చి అన్నదాతలకు అండగా నిలుస్తున్నాం. ఈ వానాకాలంలో బ్యాంకు ఖాతాలు నమోదు చేసుకున్న రైతులకు రూ.7253.54 కోట్లు జమ చేశాం. గత నాలుగేళ్లలో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద అన్ని రాష్ట్రాలకు కలిపి వ్యవసాయ రంగానికి కేంద్రం రూ.లక్ష కోట్లు వడ్డీ రాయితీపై రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. కానీ గ్రాంటుగా ఇస్తే బాగుండేది.