Minister Niranjan Reddy: జోగులాంబ అమ్మవారి సాక్షిగా బండి సంజయ్, కిషన్‌రెడ్డి అబద్ధాలు చెప్పడం మానుకోవాలని... మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. భాజపా ప్రజాసంగ్రామ యాత్ర నేపథ్యంలో... ఆ నేతలకు మంత్రి పలు ప్రశ్నలు వేశారు. 2014 పాలమూరు ఎన్నికల సభలో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టాలని మోదీ స్వయంగా చెప్పడం నిజం కాదా? అని ప్రశ్నించారు. ఆ ఎత్తిపోతలను రాష్ట్రప్రభుత్వం సొంతంగా చేపట్టిందని తెలిపారు. ఈ లిఫ్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని ఎప్పుడైనా భాజపా నేతలు అడిగారా..? అని ప్రశ్నించారు. నడిగడ్డ, పాలమూరుకు నష్టం కలిగించే కర్ణాటక అప్పర్ భద్రా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం... పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలకు ఎందుకివ్వలేదని అన్నారు.
యాసంగిలో పండే ప్రతి గింజా కొనిపించే బాధ్యత తనదేనని కిషన్ రెడ్డి చెప్పింది నిజం కాదా..? అన్నారు. అప్పుడ అలా చెప్పి.. ఇప్పుడు రా రైస్, బాయిల్డ్ రైస్ అంటూ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని.. ధాన్యం కొనుగోలు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే.. అది కూడా తమ ఘనతేనని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. జోగులాంబ ఆలయం పురావస్తుశాఖ పరిధిలో ఉన్నందున... ప్రభుత్వం ఏ పని చేపట్టలేకపోతుందని మంత్రి వెల్లడించారు. కేసీఆర్ యాదాద్రిని పునర్‌నిర్మించినట్లుగా.... కిషన్‌రెడ్డి జోగులాంబ ఆలయాభివృద్ధి చేస్తారా..? అని సవాల్ విసిరారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి పాదయాత్ర చేయాలని నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలను మభ్యపెట్టి భాజపా తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.