బాలకార్మిక వ్యవస్థ సామాజిక రుగ్మత అని, అందరూ కలిసి ఈ వ్యవస్థను నిర్మూలించాలని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి కోరారు. ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బాలకార్మిక వ్యవస్థపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మికశాఖ సంయుక్త కార్యదర్శి గంగాధర్, ఇతర అధికారులతో కలిసి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన గోడపత్రిక, బ్రౌచర్, సావనీర్ విడుదల చేశారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక చాలా తగ్గిందన్నారు. బాలలతో పని చేయించుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పిల్లల బాల్యం ఆటపాటలతో, చదువుతో నిండిపోవాలని... పనితో కాదని సినీహీరో నాగార్జున అన్నారు. 14 ఏళ్లలోపు పిల్లల్ని పనికి పంపినా... వాళ్లతో పని చేయించినా చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. పిల్లల్ని చదివించాలని సూచించారు. బాల కార్మికులు లేని తెలంగాణ... బంగారు తెలంగాణ అవుతుందని తెలిపారు.
పిల్లలు దేవునితో సమానమని... మరి దేవుడితో పని ఎలా చేయిస్తామని సినీనటుడు కాదంబరి కిరణ్ కుమార్ అన్నారు. పిల్లలను పనికి కాదు బడికి పంపాలని పేర్కొన్నారు. బాల కార్మిక రహిత తెలంగాణను నిర్మించుకుందామని కోరారు.
'బాలకార్మిక వ్యవస్థ సామాజిక రుగ్మత' ఇదీ చదవండి:ఉపాధిహామీ నిధులను వాడుకునేందుకు సర్కార్ సన్నద్ధం