తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు?'... అమిత్​షాకు కేటీఆర్​ బహిరంగ లేఖ - అమిత్​షాకు కేటీఆర్​ బహిరంగ లేఖ

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కేవలం ఉపన్యాసాలిచ్చి వెళ్లిపోవటం భాజపా నాయకులకు అలవాటైపోయిందని మండిపడ్డ కేటీఆర్​.. తెలంగాణ పట్ల చిత్తశుద్ది ఉంటే తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్​ చేశారు.

minister ktr wrote open letter to union minister amit shah
minister ktr wrote open letter to union minister amit shah

By

Published : May 13, 2022, 8:58 PM IST

Updated : May 14, 2022, 7:03 AM IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ చేపట్టిన ప్రజాసంగ్రామయాత్ర ముగింపు సందర్భంగా.. రాష్ట్రానికి విచ్చేస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు గడిచినా తెలంగాణపై భాజపాది కక్ష, వివక్షే అలానే ఉందని కేటీఆర్ ఆరోపించారు. ఉపన్యాసాలిచ్చి పత్తా లేకుండా పోవడం భాజపా నాయకులకు అలవాటైపోయిందని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రం పట్ల చిత్తశుద్ది ఉంటే తాను సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని అమిత్​షాకు సవాల్‌ విసిరారు.

విభజన చట్టంలోని ఒక్క హామీనైనా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందా..? అని అమిత్ షాను కేటీఆర్ ప్రశ్నించారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టకుండా గుజరాత్​లో 20వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం తెలంగాణపై చిన్నచూపునకు నిదర్శనం కాదా..? అన్నారు. వైద్య కళాశాలలు, ఐఐఎం, ఐసర్, ఏఎన్ఐడీ, ట్రిపుల్ ఐటీ, గిరిజన విశ్వవిద్యాలయం, నవోదయ విద్యాలయాలను తెలంగాణకు ఎందుకు కేటాయించడం లేదో చెప్పగలరా..? అని ప్రశ్నించారు. గుజరాత్ వైద్య విద్యార్థికి వైద్య ప్రవేశాల్లో అన్యాయం జరిగితే బాధపడిన ప్రధాని మోదీకి.. తెలంగాణ బిడ్డలకు జరుగుతున్న అన్యాయం ఎందుకు కనిపించడం లేదన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు హామి ఎందుకు తుప్పు పట్టించారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీలు ఎందుకివ్వడం లేదని నిలదీశారు. ఐటీ రంగంలో హైదరాబాద్ సాధిస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు ఐటీఐఆర్ రద్దు చేయడం భాజపా, కేంద్ర ప్రభుత్వ కుట్రలకు పరాకాష్ట కాదా..? అని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రానికి సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కులు ఎందుకివ్వడం లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని గతంలో సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చారని.. ఆ హామీని ఎందుకు అమలు చేయడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. మరోవైపు పక్కనున్న కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించడం తెలంగాణ రైతుల పట్ల వివక్షకు నిదర్శనం కాదా..? అన్నారు. రాష్ట్రానికి దక్కాల్సిన 575 టీఎంసీల సాగునీటి వాటాల కేటాయింపులపై బ్రిజేష్ కూమార్ ట్రిబ్యునల్​కు సిఫార్సు చేయకుండా 8 ఏళ్లుగా ఎందుకు తాత్సారం చేస్తున్నారన్నారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు అనే ఒక శిఖండి సంస్థను ఏర్పాటు చేసి, రాష్ట్రానికి సాగునీటి జలాల హక్కులు దక్కకుండా తాత్సారం చేయడం వివక్ష పూరిత తీరు కాదా..? అని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన నిధులు కాకుండా ప్రత్యేకంగా రాష్ట్రానికి చేసిన సాయం ఏమిటో సమాధానం చెప్పాలన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టులకు 24 వేల కోట్లు గ్రాంట్ ఇవ్వాలని సాక్షాత్తూ నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా... ఇప్పటిదాకా పైసా ఇవ్వక పోవడం వివక్ష కాదా..? అన్నారు. స్కైవేల నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములు అడిగితే ఏడేళ్లుగా తొక్కిపడుతూ నగర పౌరులను అవస్ధలకు గురిచేస్తున్నది నిజం కాదా..? అన్నారు. భాజపా పాలిత రాష్ట్రాల్లోని నది ప్రక్షాళనకు వేల కోట్లు కేటాయించుకుంటూ, మూసీ అభివృద్దికి మూడు పైసలు కూడా కేటాయించనిది నిజం కాదా..? అని ప్రశ్నించారు.

హైదరాబాద్​లో వరద సాయానికి నయాపైసా ఇవ్వకుండా, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వస్తున్నారని.. నిలదీశారు. ఇది మీకు సిగ్గుచేటు కాదా.. అని ప్రశ్నించారు. కొవిడ్ వ్యాక్సిన్ల తయారీతో దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన హైదరాబాద్ ఫార్మా రంగానికి అయువు పట్టుగా నిలిచేలా ఎర్పాటు చేస్తున్న హైదరాబాద్ ఫార్మాసిటీకి ఎందుకు సహాయం అందించడం లేదన్నారు. తెలంగాణకు ఢిపెన్స్ కారిడార్.. మెగా పవర్ లూం టెక్స్ టైల్ క్లస్టర్.. నిజామాబాద్ రైతులకు పసుపుబోర్డు ఎందుకు మంజూరు చేయడం లేదన్నారు. పంజాబ్​లో మాదిరిగా తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తెలంగాణ రైతులు కోరితే ఎందుకు స్పందించడం లేదన్నారు. పెట్రో ధరలపై సెస్సులను రద్దు చేసి ప్రజలకు ఉపశమనం కలిగించాలన్న సీఎం కేసీఆర్ డిమాండ్​పై వైఖరి స్పష్టం చేస్తారా..? అన్న కేటీఆర్... పెట్రో ధరలను తగ్గిస్తారో లేదో తెలంగాణ గడ్డపై నుంచి స్పష్టం చేయాలన్నారు. ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్​ను గుజరాత్​కు తరలించడం పక్షపాత వైఖరి కాదా..? అన్నారు. హైదరాబాద్​లో ఆర్బిట్రేషన్ సెంటర్​కు ఒక్కపైసా సాయం చేయకపోగా.. పోటీగా గుజరాత్​లో మరో కేంద్రం పెట్టింది వాస్తవం కాదా..? చెప్పాలని అమిత్​షాను కేటీఆర్ డిమాండ్ చేశారు.

తెలంగాణ ఆవిర్భవించి ఎనిమిదేళ్లయినా భాజపా కక్ష, వివక్ష అలాగే ఉందని కేటీఆర్ ధ్వజమెత్తారు. కేంద్రం కడుపు నింపుతున్న తెలంగాణ కడుపు కొట్టడం మానడం లేదని ఆరోపించారు. రాష్ట్రానికి వచ్చి ఉపన్యాసాలు దంచి విషం చిమ్మి మళ్లీ పత్తా లేకుండా వెళ్లడం భాజపా కేంద్ర నాయకులకు అలవాటుగా మారిందని విమర్శించారు. తెలంగాణపై ఇంకా ఎంత కాలం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తారని దుయ్యబట్టారు. చట్టబద్ధంగా ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చని భాజపా.. గుజరాత్​కు మాత్రం ఇవ్వని హామీలు కూడా ఆగమేఘాలపై అమలు చేయడం దేనికి సంకేతమని అమిత్​షాను కేటీఆర్ ప్రశ్నించారు. ఆత్మగౌరవ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అస్థిత్వాన్ని కూడా ప్రశ్నించడం భాజపాకే చెల్లిందన్నారు.

మరోసారి రాష్ట్రానికి అమిత్​షా వస్తున్న వేళ.. విభజన చట్టంలోని హామీలను కేంద్రం దృష్టికి తేవడంతోపాటు, వాటి కోసం తెగేదాక కొట్లాడటం బాధ్యత తమపై ఉందన్నారు. అందుకే... తెలంగాణ సమాజం ముక్తకంఠంతో నినదిస్తున్న పలు కీలక అంశాలు అమిత్​షా దృష్టికి తీసుకువస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అయితే ఎన్ని చెప్పినా.. ఎంత ప్రశ్నించినా.. తెలంగాణ పట్ల భాజపా వ్యతిరేక వైఖరిలో మార్పు రాదని రాష్ట్ర ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారన్నారు. గుజరాత్​పై వల్లమాలిన ప్రేమను.. తెలంగాణపై సవితి తల్లి ప్రేమను ఇలాగే కొనసాగిస్తే భాజపా.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.

బహిరంగ లేఖలో కేటీఆర్​ సంధించిన ప్రధాన ప్రశ్నలు..

  • విభజన చట్టంలోని ఒక్క హామీనైనా కేంద్రం నెరవేర్చిందా..?
  • కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్‌లో ఎలా వస్తుంది? కాజీపేటలో ఎందుకు పెట్టరు..?
  • నవోదయ, ఐఐఎం, ఐసర్ విద్యాలయాలు ఎందుకు కేటాయించలేదు..?
  • బయ్యారం ఉక్కు పరిశ్రమ హామీకి ఎందుకు తుప్పు పట్టించారు..?
  • హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి అడ్డుకునేందుకు ఐటీఐఆర్ రద్దు కుట్ర కాదా..?
  • ఐటీ రంగంలో అగ్రస్థానంలో తెలంగాణ ఉంది.. అలాంటిది సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కు ఎందుకివ్వడం లేదు..?
  • పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదు..?
  • సాగునీటి హక్కులు దక్కకుండా చేస్తున్న తాత్సారంపై ఏం చెప్తారు..?
  • హైదరాబాద్ ఫార్మాసిటికి ఎందుకు సాయం అందించడం లేదు..?
  • ఢిపెన్స్ కారిడార్ ఎందుకు మంజూరు చేయడంలేదు..?

ఇవీ చూడండి:

Last Updated : May 14, 2022, 7:03 AM IST

ABOUT THE AUTHOR

...view details