రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, మున్సిపల్ ఛైర్పర్సన్లకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లేఖలు రాశారు. ప్రతి ఆదివారం పది గంటలకి పది నిమిషాలు అనే కార్యక్రమంలో భాగస్వాములవుతూ, ప్రజలందరినీ భాగస్వాములను చేయాలని కోరారు. రానున్న వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు రాకుండా చూద్దామని లేఖలో ప్రస్తావించారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో సొడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ప్రతి వారంకోసారి ఉపయోగించనున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మురికి కాల్వల పూడిక తీత, లోతట్టు ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీటిని ఎత్తిపొయడం, ప్రతి రోజు చెత్త తరలింపు కార్యక్రమాలను కూడా ప్రత్యేకంగా చేపట్టాలన్నారు. ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమం రానున్న పదివారాలు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తమ ఇళ్లు, పరిసరాల్లో దోమలు నిలిచి ఉండేందుకు ఆస్కారమున్న వాటిని శుభ్రపరుచుకోవడం, యాంటీ లార్వా కార్యక్రమాలను చేపట్టాల్సిందిగా తన లేఖలో కోరారు.