భారీ వర్షాలు హైదరాబాద్‌ను ముంచెత్తిన నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. బుధవారం ఉదయం.. జీహెచ్ఎంసీ కార్యాలయంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి... వర్షాలు కొంత తెరిపినివ్వడంతో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సంస్థలు, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు వేగవంతం చేయాలన్నారు. నగరానికి చెందిన శాసన సభ్యులు, కార్పొరేటర్లు, ఇతర ఉన్నతాధికారులు.. క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా నిలవాలని కేటీఆర్ సూచించారు.
ప్రభుత్వం అండగా ఉంటుందని...
సచివాలయంలో సీఎస్ సోమేశ్ కుమార్, అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన... హైదరాబాద్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అనంతరం మంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని భైరామల్‌గూడ చెరువును పరిశీలించిన కేటీఆర్... పరిసర కాలనీల ప్రజలను పరామర్శించారు. చెరువు ఉప్పొంగి తమ ఇళ్లలోకి నీరు వచ్చిందని కాలనీ వాసులు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి.. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కార్పొరేటర్లకు సూచించారు.
మరో రెండు రోజులు వర్షాలున్నాయ్..
ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతపూర్ చెరువు నిండి హబ్సీగూడాలోని వీధులు, ఇళ్లలోకి చేరింది. అక్కడి పరిస్థితులను అంచనా వేసేందుకు.. కేటీఆర్ ఆ ప్రాంతంలో పర్యటించారు. మలక్ పేటలోని అంజపుర, తీగలగూడా, ముసరంబాగ్, మూసానగర్, శంకర్ నగర్ కాలనీలను కేటీఆర్ పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తమ సమస్యలను మంత్రికి వివరించారు. తక్షణ సాయంగా వారందరికీ అవసరమైన ఆహారం, దుప్పట్లు, వైద్య సదుపాయాలను అందించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా జీహెచ్ఎంసీ షెల్టర్లలో ఉండాలని సూచించారు.